అన్నప్రాశన.. అనామిక వేలు

అన్నం పరమార్థం కావాలన్న తలపే అన్నప్రాశనం. ఆడపిల్లలకు ఐదో నెల ఐదోరోజు, మగపిల్లలకు ఆరోనెల ఆరోరోజు చేసే ఈ వేడుకలో అనామిక వేలుతో, బంగారు ఉంగరంతో పరమాన్నాన్ని ముట్టిస్తారు.

Updated : 27 Oct 2022 01:29 IST

అన్నం పరమార్థం కావాలన్న తలపే అన్నప్రాశనం. ఆడపిల్లలకు ఐదో నెల ఐదోరోజు, మగపిల్లలకు ఆరోనెల ఆరోరోజు చేసే ఈ వేడుకలో అనామిక వేలుతో, బంగారు ఉంగరంతో పరమాన్నాన్ని ముట్టిస్తారు. చిన్నారి ఎదుట కలం, పుస్తకం, బంగారం, కత్తి, డబ్బు, ఆహారం తదితరాలను ఉంచుతారు. పసిపిల్లల్లో అంతర్లీనంగా దాగివుండి, వారి భవిష్యత్తును వికసింపజేసే సహజగుణాలను పసిగట్టడమే ఆయా వస్తువులను పట్టించే వినోద ప్రక్రియ. అన్నప్రాశనలో అనామిక వేలుతో తినిపించడంలో విశేషముంది. ఐదు వేళ్లు స్వయంభూ, పరమేష్ఠి, చంద్ర, సూర్య, పృథ్వి అనే ఐదు పర్వాలకు ప్రతీకలు. పరమేశ్వరుని పంచకళా వ్యయ తత్త్వం శరీర సృష్టిలో వేళ్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఇందులో చంద్రుడిది అనామిక స్థానం. చంద్రుని వలన ఓషధులు ఉత్పన్న మౌతాయి. అన్నాన్ని వైదిక భాషలో సోమం అంటారు. అంటే అమృతం. చంద్రుడి కిరణాల్లో ఉండే సోమరసామృతాన్ని దేవతలు సేవించి అమరులయ్యారు. కనుక చంద్రుడు అన్నాధిదేవత. ఈ అమృతత్వం, అమరత్వం అనేవి చంద్రుడు, ఆహారాల వల్ల సంక్రమిస్తున్నాయి. అందువల్ల చంద్ర స్థానమైన అనామిక వేలుతో అన్నప్రాశన చేస్తారు.        

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని