ఆనందయోగం

లోకంలో జీవరాశులన్నీ సుఖాన్నే కోరుకుంటాయి. హాయిగా కాలం గడపాలనుకుంటాయి. అందుకోసం ఆరాటపడతాయి, పోటీపడతాయి.

Published : 03 Nov 2022 00:08 IST

లోకంలో జీవరాశులన్నీ సుఖాన్నే కోరుకుంటాయి. హాయిగా కాలం గడపాలనుకుంటాయి. అందుకోసం ఆరాటపడతాయి, పోటీపడతాయి. ఉన్న వనరులను అనుభవించాలని చూస్తాయి. మనిషి మాత్రం ఆహార నిద్రా మైథునాలకు మించిన సుఖాలకోసం వెంపరలాడతాడు. వస్తువులూ పదార్థాలతో శాశ్వత అనుభూతి కరువైందని ఒకనాటికి తెలుసుకుంటాడు. తరగని సుఖం కావాలని అంతరంగం గోలపెడుతుంది. నిత్యసుఖానికి సత్యజ్ఞానమే శరణ్యమని గ్రహించిన వేమన్న లాంటి భోగజీవులు యోగిరాజులయ్యారు. సచ్చిదానందమే జీవిత పరమార్థమని గ్రహించారు. జ్ఞానానందమే పరమ గమ్యంగా జీవితం సాగింది. సచ్చిదానందం పరమాత్మ స్వరూపం.

మనుషులు ఒకటే అయినా మనసులు వేరు. పూర్వ జన్మల వాసనలను బట్టి కోరికలు, వాటిని బట్టి జీవితాలు నడుస్తాయి. మొగలి, జాజి, గులాబి, మల్లె, పారిజాతం- దేని పరిమళం దానిది. మనుష్యానందం, గంధర్వానందం, పితృదేవతానందం, అద్వైతానందం, నిజానందం, ముఖ్యానందం, బ్రహ్మానందం, వాసనానందం, విద్యానందం- అంటూ 9 రకాలున్నాయి. ఒక్కో స్థితిలో ఒక్కో అనుభూతి. సాత్వికస్థితిలో బ్రహ్మమేనన్న భావనతో ఆనందం కలుగుతుంది. సమాధి స్థితిలో సంతృప్తి కలిగితే అది ఆత్మానందం.
అంతా ఒకటేనన్న సమైక్య భావన అద్వైతానందం. సమతా భావనతో నిజానందం, అహంకార నాశనంతో ముఖ్యానందం, బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మానందం, బోధనతో విద్యానందం, విజ్ఞానంతో వాసనానందం కలుగుతాయి. నిర్వికల్ప సమాధిలో పొందే బ్రహ్మానందం నిత్యం, నిశ్చలం, నిరతిశయం. అశివకర్మల వల్ల చెడువాసనలు, వాటివల్ల మనసు వికలమై దుఃఖం కలుగుతుంది. సుఖానికైనా, దుఃఖానికైనా మనిషికి ఆసరా మనసే. ఆత్మజ్ఞానంతో నిజానంద సహజసిద్ధి పొందుతుంది. స్థూల స్థితి నుంచి అతి సూక్ష్మ స్థితికి చేరుకున్నప్పుడు మనసు దాని ఉత్పత్తి స్థానమైన పరమాత్మలో తాదాత్మ్యం చెందుతుంది. ఒక వస్తువు కంటికి దూరమై చివరికి అదృశ్యమై మనోనేత్రం ముందు సాక్షాత్కరిస్తుంది.

నిరాకార, సాకారాలు, బొమ్మబొరుసుల లాంటివి. ‘అదృశ్యో రూపపీఠేస్తి’ అన్నారు. అక్కడ అదృశ్యం, ఇక్కడ ప్రత్యక్షం. మనసులో వికారాలు కడగట్టితే నిరాకారం సాకారమై కంటికి కనిపిస్తుంది. చిత్తవృత్తి నిరోధమే యోగం అంటోంది పతంజలి యోగ సూత్రం. ధ్యానోపాసన ఉభయతారకమైన ఆనంద రసాస్వాదనకు తగిన మార్గం. అదే జీవన వేదం.

- ఉప్పు రాఘవేంద్రరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని