మానసిక ప్రక్షాళనే విపశ్యన

బుద్ధుని అష్టాంగ మార్గాన్ని ఆచరణలోకి తీసుకొస్తుంది విపశ్యన. ఇది శరీరాన్ని ప్రయోగశాలగా మార్చి మనోవికారాల అనిత్య స్వభావాన్ని అనుభవంలోకి తెస్తుంది.

Updated : 17 Nov 2022 00:38 IST

బుద్ధుని అష్టాంగ మార్గాన్ని ఆచరణలోకి తీసుకొస్తుంది విపశ్యన. ఇది శరీరాన్ని ప్రయోగశాలగా మార్చి మనోవికారాల అనిత్య స్వభావాన్ని అనుభవంలోకి తెస్తుంది. సమత, సాక్షీభావనలతో మనసును నిర్మలపరిచి, దుఃఖ విముక్తం చేయడమే విపశ్యన లక్ష్యం.

పాళీభాషలో ‘విపశ్యన’ అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. కోరికలే దుఃఖానికి కారణమన్న గౌతమబుద్ధుడు దానికి నివారణగా 2500 ఏళ్ల క్రితం బోధించిన మార్గమిది. ఇందులో శీల, సమాధి, ప్రజ్ఞ- అంటూ మూడు దశలున్నాయి. మనకి నచ్చనివి ఎదురైతే కోపమో, భయమో, మరో విధంగానో ప్రతిస్పందిస్తాం. భావోద్వేగాలకు వశమై ఇతరులను బాధపెడతాం. కోపం చల్లారాక పశ్చాత్తాపం చెందినా, మళ్లీ కష్టం కలగ్గానే అదే కథ పునరావృతం!

బాహ్య విషయాలు మన ఇంద్రియాలను స్పృశించినపుడు కలిగే స్పందనలు, ఫలితాలు అన్నీ మానసికమే అనుకుంటాం. కానీ ప్రతి విషయ-ఇంద్రియ సంపర్కానికీ ఒక శరీర స్పందన ఉంటుందనేది బుద్ధుడు కనిపెట్టిన సత్యం. బాహ్య సంఘటన జరగ్గానే మన శరీరంలో సూక్ష్మస్థాయిలో జీవరసాయన క్రియ జరిగి, సంవేదన జనిస్తుంది. దాని స్వభావాన్ని బట్టి మనం ప్రతిక్రియ చేస్తూ ఉంటాం. సుఖ సంవేదనలకు రాగం పెంచుకోవటం, దుఃఖ సంవేదనలకు ద్వేషం.. క్రమంగా ఈ రాగ-ద్వేషాలు సంస్కారాల రూపంలో మనసులోతుల్లో స్థిరపడటం, తిరిగి వెలికివచ్చి దుఃఖం కలిగించడం, అవి మరుజన్మకూ సంక్రమించడం.. ఇలా దుఃఖ వలయం కొనసాగుతుందని వివరిస్తుంది విపశ్యన. శరీర సంవేదనను ఎరుకతో గమనించి, దాని అనిత్య స్వభావాన్ని అర్థం చేసుకుని, అది రాగంగానో, ద్వేషంగానో మారకుండా ఆ గొలుసుకట్టును అక్కడే తెగ్గొట్టడం, ఆ ప్రజ్ఞతో దుఃఖవలయాన్ని ఛేదించడం విపశ్యనలో కీలకం.
‘శీల’ పాలన విపశ్యన మార్గంలో మొదటి మెట్టు. ఇందులో భాగంగా అహింస, బ్రహ్మచర్యం పాటించాలి. దొంగతనం, అసత్యం, మత్తుపదార్థాలు కూడదు. ఇవి తప్పక పాటించాల్సిన సూత్రాలు. ‘సమాధి’ విపశ్యనలో రెండో దశ. దానికదే వచ్చి వెళ్లే సహజ శ్వాసను ఎరుకతో గమనించడం దీనిలో ఉంటుంది. మొదటి మూడు రోజులు చేసే ఈ ‘అనాపనా’ సాధన వల్ల మనసు ఏకాగ్రమౌతుంది, సాధకుడికి మనసుపై నియంత్రణ కుదురుతుంది. విపశ్యనలో ‘ప్రజ్ఞ’ మూడోది. నాలుగోరోజున ఈ అసలు సాధన మొదలౌతుంది. శరీరమంతటా కలిగే సుఖ, దుఃఖ, సూక్ష్మ, స్థూల సంవేదనలను గమనిస్తూ వాటిని సమదృష్టితో చూడటం, వాటి నిరంతర మార్పునూ, తాత్కాలికతను అర్థం చేసుకుని తటస్థంగా ఉండటం- ఈ ‘అనిత్య బోధే’ విపశ్యనలో కేంద్ర విషయం.

ప్రతిదీ తాత్కాలికమే

సాధన చేస్తూపోతే, శరీరతలం ద్వారా వెలికివస్తున్న సంవేదనల బుడగలు తాత్కాలికమని, వాటిపై రాగద్వేషాలు పెంచుకోవడంలో అర్థం లేదని సాధకులకు అవగతమౌతుంది. శ్వాస, సంవేదనలను ఎరుకతో, సమతతో గమనించడం అలవాటైనందున బాహ్య పరిస్థితులనూ అలాగే తటస్థంగా ఎదుర్కొనే సామర్థ్యం మెరుగుపడుతుంది. అంటే వికారాలను ‘భోక్త’గా అనుభవించకుండా ‘ద్రష్ట’గా చూసే నేర్పు, ఓర్పు సంపాదిస్తాం. ఫలితంగా ఆ మనోవికారం క్రమంగా బలహీనమై చివరికి అదృశ్యమవడం తెలుసుకుంటాం. అలా వికారాల నుండి విముక్తి పొంది అన్ని సందర్భాల్లోనూ ప్రశాంత చిత్తంతో నిలిచేలా చేయడమే విపశ్యన సాధన ఫలితం.
‘నిన్ను నువ్వు తెలుసుకో’ అనే మాట అందరం వినేదే. ఈ తెలుసుకోవటం, వినడం, చదవడం, నమ్మడంతో కాదు. బుద్ధి స్థాయిలో ఆలోచించి కాదు. భావాల, సిద్ధాంతాల స్థాయిలో కాదు. భక్తితో, భావోద్వేగంతో కాదు. సత్యాన్ని ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా మన శరీరక్షేత్రంలో మనమే తెలుసుకునేలా చేయడం విపశ్యన ప్రత్యేకత.

స్థితప్రజ్ఞతకు మార్గం

ఇతర ధ్యాన ప్రక్రియల్లా మనసును ఏకాగ్రం చేయడంతో విపశ్యన ఆగిపోదు. అలా కలిగే ప్రశాంతత మనసు ఉపరితలస్థాయికే పరిమిత మంటుంది. సమూల మానసిక ప్రక్షాళనే లక్ష్యమనీ, అందుకోసం అంతరంగపు లోలోతులకి వెళ్లి ఎన్నో జన్మలుగా పేరుకున్న మనోక్లేశాలను కూకటివేళ్లతో సహా పెకిలించాలంటుంది. జన్మ పరంపరల ప్రసక్తి విపశ్యనలో ఉన్నప్పటికీ దీన్ని అందరూ ఒప్పు కోవాల్సిన అవసరం లేదంటారు గోయెంకా. ప్రస్తుత జీవితంలో దుఃఖం ఉందనేది సత్యమే కాబట్టి దీనికి కారణమైన అవిద్య, రాగ ద్వేషాల నుంచి బయటపడి స్థితప్రజ్ఞత పొందే వరకే విపశ్యన ప్రయోజనాన్ని పరిమితం చేయ వచ్చు- అంటారాయన.
విపశ్యన కేవలం ధ్యాన మార్గమే కాదు, జీవించే కళను అందించే పరిపూర్ణ ప్రక్రియ. దుఃఖ విముక్తి గావించే అసలైన ముక్తి మార్గం.


సత్యనారాయణ గోయెంకా 70వ దశకంలో మనదేశంలో విపశ్యనను ప్రాచుర్యంలోకి తెచ్చారు. వారు నెలకొల్పిన కేంద్రాల్లో పదిరోజులపాటు రోజూ పది గంటలకు పైగా ధ్యాన శిక్షణ ఉంటుంది. అన్ని వేళలా పవిత్ర మౌనం పాటించాలి. కనీస వసతులు తప్పించి విపశ్యన కేంద్రాల్లో ఏ ఆర్భాటమూ ఉండదు. చివరికి బుద్ధుడి ప్రతిమలు లేదా గురువు గోయెంకా పేరు, శిలాఫలకాలు ఏవీ కనిపించవు. ‘ధర్మ’ మార్గమే భూమికగా నడిచే ఈ శిబిరాల్లో ఏ మతం వారైనా పాల్గొనవచ్చు. పూర్వ సాధకుల విరాళాలే ఆధారంగా నడుస్తున్న కేంద్రాలివి.  

వివరాలకు... https://www.dhamma.org

- ఈదర రవికిరణ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని