గొడుగు, చెప్పుల సృష్టి

ఒకసారి జమదగ్ని లక్ష్యాన్ని ఛేదిస్తూ బాణాలు వేస్తుంటే వాటిని తెచ్చిస్తోంది భార్య రేణుక.

Published : 24 Nov 2022 00:21 IST

కసారి జమదగ్ని లక్ష్యాన్ని ఛేదిస్తూ బాణాలు వేస్తుంటే వాటిని తెచ్చిస్తోంది భార్య రేణుక. కొంతసేపటికి ఆమె రావడం ఆలస్యమవగా కారణమడిగాడు. మధ్యాహ్నమవడంతో ఎండ తీవ్రతకు కాళ్లు బొబ్బలెక్కి, తల మాడగా, చెట్లనీడలో దాక్కుంటూ వచ్చానంది. జమదగ్ని కోపోద్రిక్తుడై ఆమెని బాధించిన సూర్యుడి పొగరు అణచి, అస్త్రాలతో కమ్మేసి నేలమీద పడేస్తానన్నాడు. అన్నంతపనీ చేస్తాడనుకున్న సూర్యుడు మారువేషంలో ప్రత్యక్షమై, క్రోధాన్ని విడిచిపెట్టమని కోరాడు. ఎంతకీ జమదగ్ని కోపం తగ్గకపోవడంతో నిజరూపంలో దర్శనమిచ్చి ‘నా వలన ఆమెకు కలిగిన కష్టానికి మన్నించు. నా వేడిమితో నీటిని ఆవిరి చేయబట్టే కదా మేఘాలు వర్షిస్తున్నాయి. పంటలు పండి ప్రజలు సుఖంగా జీవిస్తున్నారు. వాటిని తిరిగి హవ్య రూపంలో ఇవ్వబట్టే దేవతలకు బలం చేకూరుతోది. లోకశ్రేయస్సు కోసం వేడిని పంచే నన్ను తప్పుపట్టవచ్చునా? అర్థంచేసుకుని మన్నించు’ అన్నాడు. శాంతించిన జమదగ్నికి గొడుగును, చెప్పులను సృష్టించి ఇచ్చి ‘ఈ పాదరక్షలు ధరిస్తే తీవ్ర ఉష్ణోగ్రతలోనూ కాళ్లు కాలవు. గొడుగు తలకు వేడి తగలనివ్వదు. ఈ రెండు వస్తువులను విద్యావేత్తలకు దానమిస్తే ఇహపరాల్లో సౌఖ్యం కలుగుతుంది’ అని చెప్పి అంతర్థానమయ్యాడు. అప్పటినుంచి గొడుగు, చెప్పులను శ్రాద్ధం వంటి కార్యక్రమాల్లో దానం ఇవ్వడం ఆచారమైంది.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని