వినయ విధేయ వీర హనుమ

సీతమ్మ వద్దకు వెళ్లే సామర్థ్యం రామభక్త హనుమంతుడికి మాత్రమే ఉందని అందుకు పురికొల్పారు. ఇక మారుతి తన శక్తిని మననం చేసుకుని, వానరులకు ధైర్యం కలిగించేలా మహారూపం ధరించాడు. ఒక దూత పాటించాల్సిన ఉత్తమ లక్షణాలను సముద్రాన్ని దాటడంలో చూపాడు.

Updated : 01 Dec 2022 04:42 IST

సీతమ్మ వద్దకు వెళ్లే సామర్థ్యం రామభక్త హనుమంతుడికి మాత్రమే ఉందని అందుకు పురికొల్పారు. ఇక మారుతి తన శక్తిని మననం చేసుకుని, వానరులకు ధైర్యం కలిగించేలా మహారూపం ధరించాడు. ఒక దూత పాటించాల్సిన ఉత్తమ లక్షణాలను సముద్రాన్ని దాటడంలో చూపాడు. ఆతిథ్యం స్వీకరించమని కోరిన మైనాకుణ్ణి సున్నితంగానే తిరస్కరించి, ఆపై దీవించి సంతృప్తిపరిచాడు. కార్యదక్షతను పరీక్షించడానికి వచ్చిన నాగమాత సురసను యుక్తితో మెప్పించి ఆశీర్వాదం పొందాడు. తన వేగాన్ని నిరోధించబోయిన సింహికను సంహరించాడు. లంకలో అడ్డొచ్చిన లంకిణిని దండించి, సీతమ్మ చెంతకు వెళ్లాడు. చూడగానే కంగారు పడక ఆమేనని తేల్చుకుని ధైర్యమిచ్చేలా శుభవచనాలు పలికాడు. శ్రీరాముడి దూతనని పరిచయం చేసుకుని రామయ్య గుర్తులు చెప్పి సీతమ్మ ఆశలకు జీవం పోశాడు. ఆమె వెలిబుచ్చిన సంశయాలకు చాలా వినయంగా ‘అమ్మా! ఇటువంటి పనులకు అతి మామూలువారిని పంపిస్తారు. అతి సామాన్యుణ్ణి నేను. సుగ్రీవుడి దగ్గర నాకంటే అధికులు, నాతో సమానులు ఉన్నారే గానీ నాకంటే తక్కువ ఎవరూ లేరు. త్వరలోనే రామలక్ష్మణులు వానరసేన సమేతంగా లంకపై దండెత్తి రావణ సంహారం చేస్తారని సీతమ్మకు భరోసా కలిగించాడు. కార్యసాధకుడు ఎలా ఉండాలో చూపించాడు. రావణాసురుడి పుత్రుణ్ణి, మంత్రి ప్రహస్తుడి కుమారుణ్ణి అడ్డొచ్చిన వారిని సంహరించాడు. చాకచక్యంగా వ్యవహరించి రావణసభకు చేరుకుని లంకేశుడుకి రామ హెచ్చరికలు వినిపించి, రాక్షసుల ఆగడాలను తిప్పికొట్టి మరొక్కసారి సీతమ్మకు అభయం కల్పించాడు. ఆమె ఆశీర్వాదం తీసుకుని ఇవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ‘చూశాను సీతమ్మను..’ అనే ఒక్క మాటతో జాంబవ, సుగ్రీవ, అంగద వానర సైన్యానికి ఉత్సాహం కలిగించి, రామలక్ష్మణులకు ఉపశమనం కలిగించాడు. ఇలా సుందరకాండలో అడుగడుగునా వీరత్వం, సమయస్ఫూర్తి, వినయవిధేయతలు ప్రదర్శించి వినయ విధేయ వీర హనుమగా నిలిచాడు.        

 జొన్నకూటి ప్రశాంత్‌ బాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు