అర్హత లేనివాడు

బుద్ధుడి శిష్యుడైన మహానాముని ఉపదేశంతో చిత్రుడు సన్యాస ధర్మం నుంచి సంసార ధర్మాన్ని స్వీకరించాడు. తన మామిడితోటను బౌద్ధవిహారంగా మలచి సుధర్ముణ్ణి రక్షకుడిగా నియమించాడు.

Updated : 08 Dec 2022 03:35 IST

బుద్ధుడి శిష్యుడైన మహానాముని ఉపదేశంతో చిత్రుడు సన్యాస ధర్మం నుంచి సంసార ధర్మాన్ని స్వీకరించాడు. తన మామిడితోటను బౌద్ధవిహారంగా మలచి సుధర్ముణ్ణి రక్షకుడిగా నియమించాడు. ఒకరోజు చిత్రుడు శౌరి పుత్రుడు, మౌద్గల్యులతో పాటుగా సుధర్ముణ్ణి కూడా భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. అక్కడ సుధర్ముడి కంటే తక్కిన ఇద్దరు భిక్షువులు జ్ఞానంలో మేటి అవ్వడం వలన చిత్రుడు వారికి అగ్ర గౌరవం ఇచ్చాడు. దాంతో సుధర్ముడు అలిగి జేతవనానికి వెళ్లిపోయాడు. ఈ సంగతి తెలిసిన బుద్ధుడు అతణ్ణి పిలిపించాడు. ‘జ్ఞానం ఎప్పుడూ ప్రశంసనీయమైంది. ఆరామ విహారాల మీద అధికారం, పూజా సత్కారాలు ఆశించడం, తన వల్లనే సమస్త పనులూ జరుగుతున్నాయని భ్రమించడం, ప్రతిదీ మనకు చెప్పి చేయాలనుకోవడం.. ఇలాంటివి మనలో అహంకారాన్ని పెంచుతాయి. శౌరి పుత్రుడు, మౌద్గల్యులకు ఉన్నంత జ్ఞాన పరిపక్వత నీలో లేనందున చిత్రుడు వాళ్లని అగ్రస్థానంలో కూర్చోబెట్టాడే తప్ప నిన్ను కించపరచాలని కాదు. నిజానికి మహానుభావులు సన్మానాలూ గౌరవాలూ ఆశించరు. అలాంటివారికి సంఘంలో గౌరవ మర్యాదలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఈ సంగతి ఎన్నడూ మర్చిపోకు. చిత్రుడు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు. ముందు జ్ఞానాన్ని, అర్హతను సంపాదించు’ అంటూ బోధపరిచాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని