గురువును కీర్తించిన శ్లోకత్రయం

వేదపండితులు గురువు గొప్పతనాన్ని ఎలా వర్ణించారో చూడండి.

Published : 29 Dec 2022 00:27 IST

వేదపండితులు గురువు గొప్పతనాన్ని ఎలా వర్ణించారో చూడండి...

గశబ్దస్త్వంధకారాభ్యోరుశబ్దస్తన్నిరోధక
అంధకార నిరోధిత్వాద్గురురిత్యభిధీయతే

గు అంటే అజ్ఞానం. రు అంటే ఆ అజ్ఞానాంధకారాన్ని నిరోధించేవాడు. మనలోని అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతులు వెలిగించేది గురువే. అలాంటి గురువుల్లో ఆదిగురువు వేదవ్యాసుడు. లోక కల్యాణార్థం మహా వాఙ్ఞయాన్ని నాలుగు వేదాలుగా విభజించి ప్రపంచానికి అందించాడు.

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజల శలాకయ
చక్షురున్మీలితం యేన తస్మైశ్రీగురవే నమః

అజ్ఞానమనే చీకటితో కళ్లు మూసుకుపోయినపుడు జ్ఞానకాంతితో తెరిపించే గురువుకు నమస్కరిస్తు న్నానన్నది భావం. డబ్బు, హోదా, హంగు, ఆర్భాటాలు లేకపోతే ఎవరూ దగ్గరికి రారు. ఇవేం లేకున్నా, ప్రతిఫలాపేక్ష ఆశించకుండా శాశ్వతానందం కలిగించే జ్ఞానాన్ని తన శిష్యులకు ప్రసాదిస్తాడు గురువు.

సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే
నమోవేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే

సచ్చిదానంద స్వరూపుడు, సర్వత్రా వ్యాపించేవాడు, వేదాధ్యయనంతో బోధపడేవాడు అయిన గురువుకు నమస్కరిస్తున్నాను- అనేది ఈ శ్లోకానికి అర్థం. గురువు గొప్పతనం గురించి చెప్పే సందర్భాల్లో ఈ శ్లోకత్రయాన్ని గుర్తు చేస్తుంటారు పండితులు.

శ్రీపద అగ్నిహోత్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని