గాలీ నీరూ అందరివీ

గురునానక్‌ కాలినడకనే దేశాటన చేసేవారు. ఒకరోజు బాలా, మార్దానాలతో కలిసి రావల్పిండిలో కొండ వద్దకు చేరారు. మార్దానాకు బాగా దాహమేసింది.

Published : 29 Dec 2022 00:28 IST

గురునానక్‌ కాలినడకనే దేశాటన చేసేవారు. ఒకరోజు బాలా, మార్దానాలతో కలిసి రావల్పిండిలో కొండ వద్దకు చేరారు. మార్దానాకు బాగా దాహమేసింది. కొండపైనున్న బావి సన్యాసి అధీనంలో ఉందని, అతడు డబ్బులిస్తేనే నీళ్లిస్తాడని చెప్పారు. నానక్‌ ఆశ్చర్యపోయి, మార్దానాను నీళ్లు తాగి రమ్మన్నారు. అతడు సన్యాసిని ప్రార్థిస్తే డబ్బులడిగాడు. మార్దానా కిందికొచ్చి నానక్‌కు చెప్పాడు. నానక్‌ మళ్లీ మళ్లీ వేడుకోమన్నాడు. సన్యాసి ససేమిరా అనడంతో నానక్‌ చేతికర్రతో నేలమీద తట్టినంతలో నీటిజల ఉబికి వచ్చింది. అంతా దాహం తీర్చుకున్నారు. విషయం తెలిసి చుట్టుపక్కలవారంతా అందులోంచి నీళ్లు తీసుకెళ్లసాగారు. కొన్నాళ్లకు కొండపైనున్న బావిలో నీళ్లు అడుగంటాయి. సన్యాసి ఆగ్రహించి ధ్యానంలో ఉన్న నానక్‌ మీదికి బండరాతిని తోశాడు. అది చూసిన గ్రామప్రజలు ‘తప్పుకోండి స్వామీ’ అంటూ అరిచారు. కానీ నానక్‌ కదలలేదు. రాయి దగ్గరగా వచ్చినప్పుడు చేయి అడ్డు పెట్టడంతో ఏటవాలుగా ఉన్న ఆ రాయి అలాగే నిలిచిపోయింది. అది చూసిన సన్యాసి నానక్‌ గొప్పతనాన్ని అర్థం చేసుకుని శరణువేడాడు. నానక్‌ ప్రశాంతంగా చూసి ‘నాయనా! పంచభూతాలపై దైవానికి తప్ప మరెవరికీ హక్కు లేదు. కొందరు వాటిని ఒడిసిపట్టి అధికారం చెలాయిస్తూ ఇతరులకు అందనివ్వకపోవడం నేరం. ఇకనుంచైనా సత్ప్రవర్తనతో మెలుగు’ అన్నారు. అతడా క్షణమే నానక్‌ శిష్యుడిగా మారాడు. ఇప్పటికీ రావల్పిండి వద్దనున్న ఆ పవిత్రస్థలం ‘పంజాసాహిబ్‌’ పేరుతో పూజలందుకుంటోంది. ఆ రాతిమీద నానక్‌ చేతిముద్రలు కనిపిస్తుంటాయి.

గొడవర్తి శ్రీనివాసు, న్యూస్‌టుడే, ఆలమూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని