భీష్ముడు చెప్పిన కథ

ఒకరోజు ధర్మరాజు ‘కొన్నిసార్లు మంచివారు దుర్మార్గులుగా, వాళ్లేమో సజ్జనుల్లా కనిపిస్తారు..  గుర్తించటం కొంచెం కష్టమే కదా..’ అన్నాడు.

Published : 26 Jan 2023 00:16 IST

కరోజు ధర్మరాజు ‘కొన్నిసార్లు మంచివారు దుర్మార్గులుగా, వాళ్లేమో సజ్జనుల్లా కనిపిస్తారు..  గుర్తించటం కొంచెం కష్టమే కదా..’ అన్నాడు. భీష్ముడు నవ్వి ఒక కథ చెప్పాడు...

పూర్వం రాక్షస ప్రవృత్తి గల ఒక రాజు చనిపోయి నక్కగా జన్మించాడు. గత జన్మ గుర్తుండటంతో ఇప్పుడైనా సాధువుగా ఉండాలనుకుని నక్క మాంసాహారం తినేది కాదు. అది గమనించిన పెద్దపులి దాన్ని తన వద్ద ఉంటూ భోగాలు అనుభవించమని, తనకున్న క్రూరుడనే చెడ్డపేరు పోగొట్టమని అడిగింది. ‘నాకు అవేమీ వద్దు. నీకు అవసరమై నప్పుడు హితవు చెబుతాను. కానీ నీ వద్ద ఉన్న అనుచరులు మన మధ్య భేదాలు సృష్టించగలరు. వాళ్ల మాటలు విని కోపగించనంటే మాత్రమే నీ దగ్గరుంటాను’ అంది. అందుకు ఒప్పుకున్న పులి నక్కను వెంట తీసుకెళ్లింది. దాన్ని గౌరవిస్తూ, అది చెప్పినట్లు వింటూ వినయంగా ఉండసాగింది. నక్క ఊహించినట్టుగానే పులి అనుయాయులకి కంటగింపు అయింది. అవి పులి తినే మాంసాన్ని దొంగిలించి నక్క స్థావరంలో ఉంచి, ఆహారం మాయమైందని చెప్పాయి. పులి విషయం కనుక్కోమంది. నక్క స్థావరంలో ఆహారం దొరికిందని, తాము అనుమానిస్తున్నదే జరిగిందనీ, నక్క మాంసం తినకపోవటం అసంభవం అంటూ చెప్పి, ముందే ఆకలితో రగిలిపోతున్న పులిని ఇంకా రెచ్చగొట్టాయి. పులి వెంటనే నక్కని చంపమని ఆజ్ఞాపించింది. ఈ సంగతి తెలిసిన పులి తల్లి వేగంగా అక్కడికొచ్చి తొందరపడొద్దని హితవు చెప్పింది. జరిగిందేమిటో అర్థమయ్యాక పశ్చాత్తాపం చెందిన పులి నక్కని క్షమాపణ కోరింది. అవమానించినవారితో చెలిమి తగదంటూ తన మానాన వెళ్లిపోయింది నక్క. కనుక చెప్పుడు మాటలు చేటే చేస్తాయి. సొంతంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి.

డాక్టర్‌ అనంతలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని