లక్ష్మీనివాసం

చాలాకాలం రాక్షసులను ఆశ్రయించి ఉన్న లక్ష్మీదేవి ఒకసారి వాళ్లని విడిచి దేవతల వద్దకు వెళ్లిపోయింది.

Published : 23 Feb 2023 00:15 IST

చాలాకాలం రాక్షసులను ఆశ్రయించి ఉన్న లక్ష్మీదేవి ఒకసారి వాళ్లని విడిచి దేవతల వద్దకు వెళ్లిపోయింది. ఇంద్రుడు ఆశ్చర్యపోయినా వస్తున్నది సాక్షాత్తూ లక్ష్మీదేవి కనుక ‘ఇన్నాళ్లూ మా ప్రత్యర్థులైన దైత్యుల దగ్గరే ఉన్నావు కదా! ఇప్పుడు హఠాత్తుగా ఇక్కడికెలా వచ్చావమ్మా?’ అంటూ సాదరంగా స్వాగతం పలికాడు. దేవి విషాద వదనంతో ‘ఏం చెప్పమంటావు దేవేంద్రా! వాళ్లు మరీ ధర్మమార్గాన్ని విడిచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు. శాస్త్రవిరుద్ధ జీవనాన్ని గడుపుతున్నారు. గుణహీనులై పోయారు’ అంది. ‘మరి పెద్దలు బుద్ధులు చెప్పటం లేదా?’ అన్నాడు ఇంద్రుడు.

అప్పుడు ఆ హరిప్రియ ‘ఎక్కడ నాయనా! పెద్దలు, పూజ్యులు నోరు విప్పితే నవ్వుతున్నారు. గౌరవం లేకుండా హేళన చేస్తున్నారు. తల్లిదండ్రులను లెక్కచేయక పిల్లలు పెత్తనం చెలాయిస్తున్నారు. రాత్రికీ పగలుకీ తేడా లేదు. భగవంతుడికి నైవేద్యం లేదు, అన్నార్తులకు భిక్ష లేదు. నమ్మినవాళ్లను నట్టేట ముంచుతున్నారు.

ధర్మవిరుద్ధంగా నడిచే వాళ్లనే గౌరవించి బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే దానవుల దగ్గర ఉండలేక దేవలోకంలో నివసించాలని వస్తున్నాను. నా అష్టసఖులు జయ, ఆశ, శ్రద్ధ, ధృతి (ధైర్యం, స్థిరత్వం), శాంతి, విజితి (విజయం), సంసతి (వినయం), క్షమ కూడా నా వెంట వచ్చారు’ అంది.

అప్పటి నుంచి దేవలోకం లక్ష్మీవిలాసమై విలసిల్లింది.

భారత యుద్ధం ముగిశాక అంపశయ్యపై అంతిమ క్షణాల కోసం నిరీక్షిస్తున్నాడు భీష్మాచార్యుడు. ఆ సమయంలో ‘మనం దేని వల్ల వృద్ధి చెందుతాం, దేనివల్ల నశిస్తాం? ఎక్కడ లక్ష్మి నివసిస్తుంది?’ అని ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు చెప్పిన కథ ఇది.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు