వేదన.. శోధన..

ఒక సందర్భంలో దుఃఖం ప్రస్తావన వచ్చింది. తన శిష్యులు అడిగిన సందేహాలకు మెహర్‌ బాబా.. ‘బాధ లేనివాళ్లెవరు? నాకూ ఉంది. కానీ మీలా బయటకు చెప్పుకోను

Updated : 02 Mar 2023 03:16 IST

ఒక సందర్భంలో దుఃఖం ప్రస్తావన వచ్చింది. తన శిష్యులు అడిగిన సందేహాలకు మెహర్‌ బాబా.. ‘బాధ లేనివాళ్లెవరు? నాకూ ఉంది. కానీ మీలా బయటకు చెప్పుకోను. వాటిని సమూలంగా శోధిస్తుంటే కొత్త విషయాలు తెలుస్తుంటాయి. సృష్టి మొత్తం ద్వంద్వమయం. అలా కాకుండా ఒక్కొకటే ఉంటే మన జీవితాలకు అర్థం పరమార్థం ఉండవు. కష్టం తర్వాత సుఖం, చీకటి తర్వాత వెలుగు ఇలా ద్వంద్వాలే లేకుంటే ఇంత ఉన్నతి సాధ్యమయ్యేది కాదు. చీకటి లేకుంటే విశ్రాంతి ఉండదు. దినచర్యలతో కోల్పోయిన శక్తిని పుంజుకోలేం. అపజయాలు ఎదురవకుంటే పట్టుదల పెరగదు. అజ్ఞానం అనుభవానికొచ్చినప్పుడే జ్ఞానార్జన కోసం పాకులాడతాం. వేదన లేకుంటే సాధన లేదు. అసంతృప్తే మనల్ని తృప్తి మార్గాల అన్వేషణకు పురిగొల్పుతుంది. శాంతిని అన్వేషించేందుకు అశాంతి కారణ మవుతుంది. కుంభవృష్టి తర్వాత ఆకాశం కొత్తగా ప్రకాశించినట్లు ఆత్రుత అనే జడి వానలో తడిస్తేనే పునీతులమవుతాం. అగ్నిలో పుటం పెట్టిన బంగారంలా సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు- అనే మంటల్లో కాగినప్పుడే స్వచ్ఛంగా ప్రకాశిస్తాం. బాధల్లో దాగిన చైతన్య శక్తిని గమనిస్తే వచ్చిన కష్టం దూదిపింజలా ఎగిరిపోతుంది. దీనికి కావలసింది కొంచెం ఓర్పు.. ఇంకొంచెం నేర్పు మాత్రమే. నిత్యదీపారాధన చేస్తూ ‘మాలోని అంధకారాలను తొలగించి జ్ఞాన జ్యోతిని ప్రజ్వలింపచెయ్యి. నక్షత్రాలకు కాంతిని, సూర్యచంద్రులకు ప్రకాశాన్ని ఇచ్చినట్లు మాలో దుర్గుణాలను పోగొట్టి మానవత్వాన్ని పెంచు స్వామీ అని ప్రార్థించండి’ అంటూ వివరించారు.
పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు