ధర్మం కదా ముఖ్యం

విదురుడు అవడానికి కౌరవుల పక్షమైనా ధర్మం పక్షం వహించాడు. పాండవులకు హితం చేకూర్చాడు.

Published : 16 Mar 2023 00:40 IST

విదురుడు అవడానికి కౌరవుల పక్షమైనా ధర్మం పక్షం వహించాడు. పాండవులకు హితం చేకూర్చాడు. అందుకే భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ వంటి మహా మహుల కన్నా గొప్పవాడిగా ప్రశంసలు అందుకున్నాడు. కలకాలం నిలిచిపోయే ఘనత సాధించాడు.

సీతాపహరణం అనంతరం సోదరుడైన రావణుడికి- ‘పర స్త్రీ వ్యామోహం ధర్మం కాదు, లంక వినాశనానికి అది హేతువవుతుంది’ అంటూ హితవు చెప్పాడు విభీషణుడు. దాన్ని పెడచెవిన పెట్టడంతో సోదరుణ్ణీ, లంకనూ కూడా విడిచి శ్రీరాముడి చెంతకు చేరాడు. అధర్మం ఓటమిపాలయ్యింది. రావణ సంహారం తర్వాత లంకకు విభీషణుని అధిపతిని చేశాడు శ్రీరాముడు.

కర్ణుడు పాండవుల వైపు ఉండాల్సినవాడు. దుర్యోధనుడు చేరదీసి స్నేహితుణ్ణి చేసుకున్నాడు. ఆ కృతజ్ఞతాభావంతో ఆజన్మాంతం కౌరవులను వీడలేదు. పాండవులకు అన్యాయం జరుగుతున్నా నోరు మెదపలేదు. దుష్టచతుష్టయంలో ఒకడిగా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అధర్మకూటమితో పాటు నేలకూలాడు. అందుకే ఎవరెక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు. ధర్మాన్ని ఆశ్రయించి ఉండటమే యశస్సు అన్నారు పెద్దలు. శత్రు పక్షాన ఉన్నంత మాత్రాన అందరూ శత్రువులు కాదు. శత్రుదళంలో ఉన్నా ధర్మం వైపు మొగ్గు చూపే వాళ్లే ఆదర్శనీయులు.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని