బోయను దీవించిన శివుడు

వేటతో జీవనం గడిపే బోయకు ఓ శివరాత్రి నాడు ఒక్క జంతువు కూడా కనిపించలేదు. భార్యాపిల్లల ఆకలి తీర్చేదెలా- అని బాధపడుతుండగానే చీకటి పడింది.

Published : 16 Mar 2023 00:39 IST

వేటతో జీవనం గడిపే బోయకు ఓ శివరాత్రి నాడు ఒక్క జంతువు కూడా కనిపించలేదు. భార్యాపిల్లల ఆకలి తీర్చేదెలా- అని బాధపడుతుండగానే చీకటి పడింది. కొన్ని నీళ్లు తీసుకుని మారేడుచెట్టెక్కి, జంతువు కోసం చూస్తున్నాడు. చెట్టు కింద సిద్ధులెవరో అర్చించిన శివలింగం ఉంది. కొంత సేపటికి ఓ జింక వచ్చింది. బాణం తీయబోతే సొరకాయ బుర్రలో నీళ్లు కాస్తా తొణికి మారేడు దళాల మీదుగా కిందున్న శివలింగం మీద పడ్డాయి. తెలియకుండానే తొలిజాము పూజ చేసినట్ల యింది. ఇంతలో అటుగా వచ్చిన జింక పైకి చూసి తనని చంపొద్దు, పిల్లలకి చెప్పి వస్తానంటూ ఒట్లు పెట్టింది. బోయకి తన పిల్లలు గుర్తొచ్చి, జాలిపడి వదిలేశాడు. కాసేపటికి మరో జింక వచ్చింది. బాణం వేయబోతే చెయ్యి తగిలి నీళ్లు, వాటితోబాటు కొన్ని మారేడు దళాలు శివలింగం మీద పడ్డాయి. రెండోజాము పూజ అయ్యింది. జింక తనవాళ్లకు చెప్పి వస్తానని ఒట్ట్లుపెట్టింది. మళ్లీ సరేనన్నాడు. మరికాసేపటికి బలమైన జింక వచ్చింది. బోయ చేయి తగిలి మరోసారి నీళ్లు, మారేడుదళాలు శివుడి మీద పడ్డాయి. మూడో జాము పూజ అయ్యింది. అది కూడా మళ్లీ వస్తానంటూ వెళ్లింది. అలా మూడు జింకలూ తమ స్థావరాలకు వెళ్లి జరిగింది చెప్పి, ఇచ్చిన మాట ప్రకారం వస్తోంటే వాటి పిల్లలూ వెంట వచ్చాయి. బోయ విస్తుపోయి చూస్తోంటే మళ్లీ చేయి తగిలి నీళ్లు, మారేడుదళాలు శివుడి మీద పడ్డాయి. నాలుగోజాము పూజ పూర్తయ్యింది. జింకలు దేనికదే తనను వధించి ఆకలి తీర్చుకోమంది. శివుడు ప్రత్యక్షమై బోయ పాపాలన్నీ పరిహారమయ్యాయని, అతడు గుహుడనే పేరుతో రాముడికి మిత్రుడవుతాడని దీవించాడు. అలాగే జింకల పరోపకార బుద్ధికి మెచ్చి మృగశీర్ష నామంతో నక్షత్రాలవుతాయని వరమిచ్చాడు.

డాక్టర్‌ అనంతలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని