భూమాత కోరిక

రాజులందరినీ పరశురాముడు సంహరించడంతో పాలకులు లేక ప్రజలు అధర్మ మార్గం పట్టారు. భూమి మీద అరాచకం నిండిపోయింది.

Published : 30 Mar 2023 00:16 IST

రాజులందరినీ పరశురాముడు సంహరించడంతో పాలకులు లేక ప్రజలు అధర్మ మార్గం పట్టారు. భూమి మీద అరాచకం నిండిపోయింది. ఆ దోషాలు భరించలేని భూమి కిందికి వెళ్లిపోయింది. అది తెలుసుకున్న కశ్యప ప్రజాపతి తన తొడలతో భూమిని పైకి లేపాడు. అప్పుడు భూమి ‘మరెన్నడూ భూమి మీద అరాచకం ఉండకూడదంటే రాజ్య రక్షకులు చాలా అవసరం. పరశురాముడి గొడ్డలి నుంచి తప్పించుకున్న రాజవంశీయులను వెతికి వాళ్లకు రాజ్యపాలన అప్పగించు. వాళ్లే నన్ను సురక్షితంగా కాపాడగలరు’ అంది.
జీవించి ఉన్న రాజుల పేర్లను చెప్పమని అడిగిన కశ్యపుడితో ‘కొందరు హైహయ రాజులతో బాటు కురువంశంలో జన్మించిన విదూరుథుడి కుమారుణ్ణి పర్వతప్రాంతంలో ఎలుగుబంట్లు రక్షించాయి. సుదాసు వంశస్తుణ్ణి పరాశరుడు రక్షించాడు. అతడే సర్వకర్ముడిగా ప్రసిద్ధుడు. శిబి చక్రవర్తి కుమారుల్లో ఒకరిని అరణ్యంలోని గోవులు రక్షించాయి. ప్రవర్ధనుడి కుమారుడైన వత్సుణ్ణి గోశాలలో దూడలు కాపాడాయి. అంగుడి కొడుకు దదివాహనుణ్ణి గంగాతీరంలో గౌతమ మహర్షి రక్షించాడు. బృహద్రథ వంశంలో పుట్టిన భూవిని గృధకూట పర్వతం మీద కొండముచ్చులు రక్షించాయి. మరుత్తుకు పుట్టిన ముగ్గురు బాలురను సముద్రుడు కాపాడాడు. వీరందరూ ఉత్తమ క్షత్రియులు. వాళ్లని పిలిపించి రాజ్య పాలన అప్పగిస్తే నేను స్థిరంగా ఉండగలుగుతాను’ అంది. కశ్యప ప్రజాపతి భూదేవి చెప్పిన రాజవంశీయులను రప్పించి, పరీక్షించిన తర్వాత భూమిని పంచి రాజ్యాభిషిక్తుల్ని చేశాడు.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని