సత్సంగం.. సన్మార్గం!

సద్గురు రాఘవేంద్రస్వామి జీవించి ఉన్న కాలమది. మంత్రాలయ సమీపంలో కృష్ణశాస్త్రి ఉండేవాడు. అతనికెన్నో అవలక్షణాలు.

Updated : 13 Apr 2023 04:43 IST

సద్గురు రాఘవేంద్రస్వామి జీవించి ఉన్న కాలమది. మంత్రాలయ సమీపంలో కృష్ణశాస్త్రి ఉండేవాడు. అతనికెన్నో అవలక్షణాలు. జవసత్వాలున్నంత కాలం ఎవరి మాటా వినలేదు. కానీ వయసు ఉడిగాక తనెంత దిగజారాడో తెలిసొచ్చింది. ఇంతలో రాఘవేంద్రులు సత్సంగం ఏర్పాటుచేశారు. కృష్ణశాస్త్రి కూడా వెళ్లాడు. ప్రసంగం విని కన్నీటిపర్యంతమయ్యాడు. ‘సత్సాంగత్యంతో తప్పు తెలుసుకుని, నడతను సరిదిద్దుకునేవాడు ఉత్తముడు. తనను తాను మార్చుకోని వాడు అధముడు’ అంటూ ఆశీర్వదించారు రాఘవేంద్రులు. ఆ దీవెనతో పరివర్తన కలిగింది. అందుకే ‘నిశ్చలభక్తి, నిరంతర సాధువర్తన మేళవించినవారిలో నివసిస్తాను’ అన్నాడు కృష్ణపరమాత్ముడు. పతనమైనవారు కూడా సజ్జనుల సహవాసంతో పునరుద్ధరణకు నోచు కుంటారు. సత్పురుషుల సాహచర్యం లేకనే చాలామంది అథోగతి పాలవుతారు.


అది ఆఖరి అవకాశం

మంచివారి సాహచర్యంతో మనలో ఉన్న చెడును పోగొట్టుకోవచ్చు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరిదిద్దుకుంటే సార్థకత లభిస్తుంది. ఎవరి సాంగత్యం వల్ల ఆధ్యాత్మిక భావాలు ఉద్దీపనమవుతాయో, మనసు భగవంతుడి వైపు ఆకర్షితమవుతుందో, ఎవరిని దర్శించగానే ప్రశాంతత కలుగుతుందో, భగవంతుడి ప్రాముఖ్యతను గుర్తుచేస్తుందో అలాంటి మహాత్ముల సన్నిధే సత్సంగం. అందుకే ‘కాలేన ఫలతే తీర్థం సద్యః సాధు సమా గమః’ అన్నారు. తీర్థక్షేత్ర దర్శనఫలం భవిష్యత్తులో అందుతుంది. కానీ సాధు సమాగమ ఫలితం తక్షణమే ఉంటుందని భావం.


సాంగత్యంతోనే సంస్కారం

సజ్జనుల సాహచర్యంలోకి వచ్చేంత వరకు తెలీదు, మనం అప్పటిదాకా నిరర్థకంగా కాలం గడిపామని! పైగా సన్నిహితులు మనకు ప్రియమైందే చెబుతారు కానీ హితమైంది చెప్పరు. మనం పొరపాట్లు చేస్తున్నా సరిపెట్టుకుంటారే గానీ సరిదిద్దరు. కానీ సజ్జనులు మనం దారితప్పినప్పుడు హెచ్చరిస్తారు. పరుసవేదిని తాకిన ఇనుపముక్క బంగారమైనట్లు మంచివారి సాన్నిధ్యం ఉన్నతంగా మారుస్తుంది.

పాలగతియు నీరు పాలై రాజిల్లు
గురుని వలననట్లు కోవిదుడగు
సాధుసజ్జనుల సంగతిట్లుండురా
విశ్వదాభిరామ వినుర వేమ

అంటాడు యోగివేమన. పాలతో కలసిన నీళ్లకి పాల రంగూ, రుచి వచ్చినట్లే సజ్జనుల సాన్నిహిత్యంతో పామరులకూ విద్వత్తు అబ్బుతుంది. సాధుజన స్వభావమే అంత. ఆత్మోన్నతిని సాధించాలనుకునేవారు సాధుపుంగవుల కోసం వెతకాలి. వారిని గుర్తించి వారితో జ్ఞానవిచారణ చేయాలి. అప్పుడు సత్యమేంటో, అసత్యమేంటో సుస్పష్టంగా తెలుసుకోగలుగుతారు. నిరంతరం సాధుపురుషులను ఆశ్రయించేవారిలో అప్రయత్నంగానే వివేకం ఉదయించి వికసిస్తుంది. అలాంటి వివేకవృక్ష ఫలంలోని మధుర రసమే జ్ఞానామృతం.  


నిర్మోహత్వం.. నిశ్చలత్వం

హిరణ్యకశిపుని అండ చూసుకుని ఆయన పాలనలో రాక్షసులు స్వైరవిహారం చేసేవారు. వారి సంతానం కూడా పెద్దల మార్గాన్నే అనుసరించి పెడదోవ పట్టారు. వారేం చేసినా వినాశకరమే. వారి గురువులు కూడా రాక్షసనీతినే రాజనీతిగా బోధించేవారు. ఫలితంగా గురుకులమే గతితప్పింది. ఆ స్థితిలో భక్తప్రహ్లాదుడు అడుగుపెట్టాడు. సుగుణసంపన్నుడైన ఆ ఒక్కడి సాంగత్యంతో దుష్టపరిసరాలన్నీ మారిపోయాయి. అహంకారం, అజ్ఞానం అనే ఊబిలో కూరుకుపోయిన ఆ అసుర బాలురకు ఆ బాలభక్తుడు నిరహంకారం, సుజ్ఞానంతో కూడిన స్వస్వరూపాన్ని గుర్తుచేశాడు. భగవన్నామ మాధుర్యాన్ని రుచి చూపించాడు. సత్సంగమనే గంగాజలంతో దైత్యుల హృదయక్షేత్రాలను పావనం చేశాడు. అందుకే..

సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్‌
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః

అన్నారు. సజ్జనుల సాంగత్యంతో సంసారబంధాలన్నీ విడి పోతాయి. బంధాలు విడిపోతే, అజ్ఞానమూలమైన మోహం తొలగిపోతుంది. మోహం నశిస్తే నిశ్చలమైన పరిశుద్ధ తత్త్వం గోచరిస్తుంది. ఆ నిశ్చలత్వంతో జీవితానికి ముక్తి లభిస్తుంది’ అంటారు ‘భజగోవిందం’లో జగద్గురువులు ఆదిశంకరాచార్యులు.


ఆ సాంగత్యం అత్తరు అంగడి

జ్ఞానవంతులు, సజ్జనులు ఎలాంటి ప్రబోధలు చేయకున్నా వారి జీవనమే ఓ పాఠంగా అనిపిస్తుంది. వారి వ్యవహార శైలి, నడవడిక మనకు లోకాన్ని ఓ కొత్తకోణంలో చూపిస్తుంది. ఆ ప్రభావంతో తెలియకుండానే మనలో పరివర్తన కలుగుతుంది. అందుకే ‘సత్పురుషుల సాంగత్యం అంగడి లోని అత్తరు పరిమళం వంటిది. అంగడివాడు నీకేమీ ఇవ్వకున్నా అక్కడ ప్రసరించే సువాసనను అనుభవించి ఆహ్లాదపడతావు. అలాగే సత్పురుషులతో కొంతసేపు గడిపితే వారి నుంచి ఎలాంటి బోధలు లభించ కున్నా మనసు సాంత్వన పొందుతుంది. మనలో తెలియని మార్పు కనిపిస్తుంది’ అంటాడు భక్తకబీర్‌. అయితే ఆసక్తి ఉంటేనే మనం ఆ అత్తరు అంగడిలోకి వెళ్లగలం. సత్సాంగత్యం పట్ల తపన ఉంటేనే వారిని కలవగలం. అలా ఆనాడు పరీక్షిత్తు మహా రాజు తపించాడు, తాపసి అయిన శుకమహర్షిని ఆరాధనతో ఆశ్రయించాడు. అందుకే ఆ బ్రహ్మజ్ఞాని ఏడురోజుల్లోనే ముక్తిని పొందే మార్గంగా శ్రీమద్భాగవతాన్ని ప్రవచించాడు. అలా మహనీయులు తారసపడిడితే గౌరవించే వినయాన్ని పెంచుకోవాలి. అహంకారం లేని అణకువే సత్సాంగత్యానికి ప్రధాన అర్హత.  ఆ విధంగా మహాత్ముల చెంతకు వెళ్తే వారి మాహాత్మ్యంతో మనమూ మారిపోతాం. పూర్వపు బలహీన తలు, సంశయాలు సమూలంగా నాశనమవుతాయి. అందుకే మన మహర్షులు..

గంగా పాపం శశీ తాపం దైన్యం కల్పతరు స్తథా
పాపం తాపం చ దైన్యం చ హంతి సంతో మహాశయః

అన్నారు. గంగానది పాపాన్ని పోగొడుతుంది. చంద్రుడు తాపాన్ని పరిహరిస్తాడు. కల్పవృక్షం దారిద్య్రాన్ని నశింపచేస్తుంది. మహాశయులు మన పాపాలు, తాపాలు, దారిద్య్రాలు.. అన్నిటినీ తొలగించి ఉత్తమ మార్గంలో నడిపించగలరు.

బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు