దానధర్మాలు మెట్టపొలాలు

సంపదను చిత్తశుద్ధితో అల్లాహ్‌ సంతోషం కోసమే వ్యయం చేయాలి. అలాంటి ధనాన్ని మెట్టపొలంతో పోల్చింది ఖురాన్‌.

Published : 13 Apr 2023 00:25 IST

సంపదను చిత్తశుద్ధితో అల్లాహ్‌ సంతోషం కోసమే వ్యయం చేయాలి. అలాంటి ధనాన్ని మెట్టపొలంతో పోల్చింది ఖురాన్‌. వర్షం బాగా కురిస్తే మెట్టలో రెట్టింపు పంట వస్తుంది. చిరుజల్లే కురిసినా తగినంత పండుతుంది. ఆర్జించిన ధనాన్ని పిసినారితనంతో దాచిపెట్ట కూడదు, కుటుంబ అవసరాలు తీరగా మిగిలింది దైవమార్గంలో వెచ్చించాలి. బంధువులు, అన్నార్తులను ఆదుకోవడాన్ని అల్లాహ్‌ మార్గంలో వెచ్చించే ఖర్చుగా అభివర్ణిస్తారు ముహమ్మద్‌ ప్రవక్త (స). అలా ఒక రూపాయి ఖర్చు చేస్తే 700 దానం చేసినంత పుణ్యప్రదం. దానం చేసే సొమ్ము నీతీ నిజాయితీలతో సంపాదించినదై ఉండాలి. దానంచేసి దెప్పిపొడవడం, కృతజ్ఞతను ఆశించడం, నలుగురికీ తెలిసేలా చెప్పడం చేయకూడదు. అలా చేస్తే ఇక ఆ దానం వృథాయే.

ఫిత్రా.. జకాత్‌..

ముస్లిములు దానధర్మాలను జకాత్‌, సదఖా, ఫిత్రా పద్దుల్లో ఖర్చుపెడతారు. ఏడాదిపాటు తమ వద్దనున్న సొమ్ములోంచి రెండున్నర శాతం అభాగ్యులు, అనాథలకు అందించడాన్ని జకాత్‌ అంటారు. జకాత్‌ పదానికి శుద్ధి చేయ డమని అర్థం. జకాత్‌ ఇవ్వడమంటే మన సంపదను శుద్ధి చేసుకోవడమే. రంజాన్‌ నెలలో పండుగకు ముందు చేసేది ఫిత్రా. ముహమ్మద్‌ ప్రవక్త కాలంలో ఆయన సహచరులు పావుతక్కువ రెండు కిలోల గోధుమలు లేదా మూడున్నర కిలోల ఖర్జూరాలు లేదా మూడున్నర కిలోల కిస్మిస్‌ ఫిత్రాదానంగా ఇచ్చేవారు. నేడు వాటికి సమానమైన డబ్బును దానం చేయాలని, అప్పుడే పుట్టిన శిశువుకు కూడా ఫిత్రా చెల్లించాలని చెబుతారు ఉలమాలు. ఫిత్రా దానం ముస్లిములు తప్పక అనుసరించాల్సిన విధి. అప్పుడే ఉపవాసాలు స్వీకరణకు నోచుకుంటాయని ప్రవక్త ప్రవచించారు.

పేదలకు పంచేదే సదఖా

సంపాదించిన దాంట్లోంచి కొంత మొత్తాన్ని పేదలకు పంచాలన్నదే సదఖా ఉద్దేశం. రాబోయే ప్రమాదాలు, భయోత్పాతాల నుంచి చేసిన దానధర్మాలు కాపాడతాయన్నారు ప్రవక్త. అల్లాహ్‌ మనం ఎంత దానం చేశా మని చూడడు, మన ఆంతర్యాన్ని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. మంచి సంకల్పంతో ఒక్క రూపాయి(దీనార్‌) దానం చేసినా అది మనకెన్నో శుభా లను కలిగిస్తుంది. ఈ విషయంలో పూర్వీకులను అనుసరించాలి.

మెప్పు ఆశించొద్దు

‘విశ్వసించిన ప్రజలారా! పరుల మెప్పు కోసమే ధనాన్ని ఖర్చుచేసే వారిలా, అల్లాహ్‌పై నమ్మకం లేనివారిలా, అంతిమ దినాన్ని విశ్వసించని వారిలా ప్రవర్తించకండి. దానం తీసు కున్నవారిని దెప్పిపొడుస్తూ, వాళ్ల మనసును గాయపరచ కండి. ఒకరి మెప్పు పొందడం కోసం దానం చేయడం ఎలాంటిదంటే.. ఓ కొండ మీద కొంత మట్టి చేరింది. భారీ వర్షం వల్ల ఆ మట్టి కాస్తా కొట్టుకుపోయింది. చివరికి కొండరాయి మాత్రమే మిగిలింది. ఇతరుల మెప్పును ఆశించి చేసే దానాలు, పుణ్యకార్యాల ఫలితం అలాగే కొట్టుకుపోతుంది. దాని వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు..’ అని ప్రవచిస్తోంది ఖురాన్‌.
కష్టార్జితంతో సంపాదించిన చిన్న ఖర్జూర ముక్కనైనా సదఖా (దానం) చేయమని ప్రవక్త (స) చెప్పారు. గొర్రెల కాపరి మేకను పోషించినట్లు ఆ ఖర్జూర ముక్కను అల్లాహ్‌ స్వయంగా తన చేతితో స్వీకరించి దాన్ని వృద్ధిచేస్తాడు. అలా చిన్న ఖర్జూర ముక్క ప్రయళం రోజున పర్వత స్థాయిలో రక్షిస్తుంది.    

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని