అల్లాహు అక్బర్‌.. అల్లాహు అక్బర్‌..

రంజాన్‌ నెలలో స్వర్గద్వారాలు తెరుచుకుంటాయన్న ముహమ్మద్‌ ప్రవక్త ప్రవచనానికి అనుగుణంగా ఆధ్యాత్మిక జీవనం.. ఖురాన్‌ పఠనం, నమాజు, జకాత్‌, ఫిత్రా దానాలు.. రోజంతా రోజా.. సాయంత్రం ఇఫ్తార్‌ విందు.

Updated : 20 Apr 2023 06:04 IST

రంజాన్‌ నెలలో స్వర్గద్వారాలు తెరుచుకుంటాయన్న ముహమ్మద్‌ ప్రవక్త ప్రవచనానికి అనుగుణంగా ఆధ్యాత్మిక జీవనం.. ఖురాన్‌ పఠనం, నమాజు, జకాత్‌, ఫిత్రా దానాలు.. రోజంతా రోజా.. సాయంత్రం ఇఫ్తార్‌ విందు.. నెలరోజులు ఇట్టే గడిచి.. రంజాన్‌ పండుగ వచ్చేసింది!

హరీ, ఇఫ్తార్‌, ఖురాన్‌ పఠనం, తరావీహ్‌ నమాజు లతో సహనశీలత, కృతజ్ఞతాభావం కలుగుతాయి. మండే ఎండల్లో రోజా పాటించడాన ఆకలిని తట్టుకునే సహనం అలవడుతుంది. ‘ఓ అల్లాహ్‌! ఇదంతా నీ కృపాకటాక్షాలతోనే సాధ్యం. నీకు వేలవేల కృతజ్ఞతలు..’ అంటూ ‘అల్లాహు అక్బర్‌’ నినాదాన్ని బిగ్గరగా పఠిస్తూ ఈద్గాహ్‌కు చేరుకుంటారు. ‘తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్‌ కుమ్‌..’ అంటూ వేడుకుంటారు. రంజాన్‌ ఆరాధనలను అల్లాహ్‌ స్వీకరించాలనే విన్నపం అది.  

నెల రోజుల రంజాన్‌ ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపే శుభసందర్భమే ఈదుల్‌ ఫిత్ర్‌ పర్వదినం. ఈద్గాహ్‌ మైదానానికి చేరుకుని అల్లాహ్‌ ఘనతను చాటిచెప్పే ముస్లిముల హృదయాలు పులకించిపోతాయి. ‘ఓ అల్లాహ్‌! మేము 30దినాలు పాటించిన రంజాన్‌ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు అన్నీ నువ్వు పెట్టిన భిక్షే’ అంటూ ఆనంద బాష్పాలు రాల్చే శుభఘడియలు. రంజాన్‌ నెలలో అల్లాహ్‌కు ఇచ్చిన వాగ్దానాలు మిగిలిన పదకొండు నెలలూ ఆచరణకు నోచుకోవాలని ఆశిస్తారు. ఈ స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగించే భాగ్యాన్ని ఇవ్వమని విన్నవించుకుంటారు. రెండు రకాల షుక్రానా నమాజు చేస్తారు. ఈ రంజాన్‌ నుంచి మళ్లీ వచ్చే రంజాన్‌ వరకూ స్వర్గాన్ని ఉపవాసకుల కోసం ముస్తాబు చేస్తారు. అలాంటి పండుగను మరోసారి ఇచ్చినందుకు అల్లాహ్‌కు షుక్రియా తెలియజేస్తారు.

రంజాన్‌ ప్రత్యేక రోజుల్లోనే కాదు.. ఏడాదంతా ఇలానే జీవించేలా ఆశీర్వదించమని అల్లాహ్‌ను వేడుకుంటారు. ‘నెలంతా ఎన్ని ఆరాధనలు, మరెన్ని పుణ్యకార్యాలు నిర్వహించినా వాటిపట్ల మాకు రవ్వంత గర్వం కలగకూడదు. పాటించిన ఉపవాసాలు, పఠించిన ఖురాన్‌, రాత్రి వేళల్లో నిద్రను త్యాగంచేసి ఆచరించిన నమాజులు, జకాత్‌, ఫిత్రా దానాలను కారుణ్యంతో స్వీకరించు ప్రభూ! మా శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ప్రసాదించు’ అని వేడుకుంటారు. నమాజు తర్వాత ఒకరికొకరు ‘ఈద్‌ ముబారక్‌’ అంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పరస్పరం ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు.

అందరి పండుగ

ఈదుల్‌ ఫిత్ర్‌ పండుగ నాడు ముస్లిమ్‌లందరూ తమ స్థాయికి తగినట్లు ఉన్నంతలో గొప్పగా వేడుక చేసుకుంటారు. ఇంటిల్లి పాదీ కొత్తబట్టలు ధరించడం, అత్తరు పరిమళాలను పులుము కోవడం ప్రవక్త సంప్రదాయంగా భావిస్తారు. షీర్‌ ఖుర్మా పాయసాన్ని దగ్గరి బంధువులు, మిత్రులు, ఇరుగుపొరుగు వారికి అందించి ఆత్మీయతను చాటుకుంటారు. తమకు అల్లాహ్‌ అనుగ్రహించిన భాగ్యాలను అందరితో పంచుకోవాలన్నది ప్రవక్త బోధన. ఫిత్రా, జకాత్‌ దానాలతో నిరుపేదలు సైతం పండుగను సంతోషంగా చేసుకుంటారు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫిత్రా దానాన్ని లెక్కించి పేదలకు పంచాలన్న ప్రవక్త సూక్తిని పాటిస్తారు. ఇవ్వదగిన స్థితిలో ఉండి కూడా ఫిత్రా చెల్లించకపోతే ఉపవాసాలు అల్లాహ్‌ స్వీకరణకు నోచుకోవు అన్నది ప్రవక్త హెచ్చరిక.


శుక్రవారం నెలవంక కనిపిస్తే.. శనివారం ఈదుల్‌ ఫిత్ర్‌

ఈదుల్‌ ఫిత్ర్‌ ఇలా..

ఈదుల్‌ ఫిత్ర్‌ పర్వదినం నాడు ముహమ్మద్‌ ప్రవక్త (స) కొన్ని ఖర్జూర పండ్లు తిని నమాజు కోసం ఈద్గాహ్‌కు వెళ్లేవారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముస్లిములు ఖర్జూరాలు తిని బయల్దేరతారు. ఈద్గాహ్‌కు కాలినడకన వెళ్లడమే ఉత్తమం. ఈద్‌ నమాజు తర్వాత పిల్లలకు ఈదీ పేరుతో ఈద్‌ కానుకలు ఇస్తారు.

ఖజా రోజాలు..

రంజాన్‌ నెలలో బలమైన కారణం లేకుండా ఒక్క రోజాను వదిలేసినా.. ఇక తర్వాత ఏడాదంతా ఉపవాసం పాటించినా సరే.. దానితో సరితూగదన్నది ప్రవక్త బోధల సారాంశం. కానీ బాలింతలు, రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, రోగగ్రస్తులు.. ఇలా కొందరికి మాత్రం... రంజాన్‌ నెల ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంది. వీళ్లు రంజాన్‌ నెలలో చేయలేకపోయిన ఉపవాసాలను మిగతా రోజుల్లో పాటించి, ఆ సంఖ్యను పూరించాలన్నది ఖురాన్‌ ఉద్బోధ. ఇలా చేసే ఉపవాసాలను ఖజా రోజాలు అంటారు. రంజాన్‌ స్ఫూర్తిని ఏడాదంతా కొనసాగించాలని, అలాగే రంజాన్‌ నెలలో చేయలేకపోయిన రోజాలను త్వరగా పూర్తిచేసేందుకు ప్రయత్నించాలని ఉలమాలు చెబుతారు.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు