అద్భుత కళాఖండం

ఎవరైనా జపాన్‌లో ఒబాకు మందిరానికి వెళ్తే.. గేటు పక్కన పెద్ద అక్షరాలతో లిఖితమైన ‘ది ఫస్ట్‌ ప్రిన్సిపాల్‌’ అనే చెక్కఫలకం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Published : 20 Apr 2023 00:44 IST

వరైనా జపాన్‌లో ఒబాకు మందిరానికి వెళ్తే.. గేటు పక్కన పెద్ద అక్షరాలతో లిఖితమైన ‘ది ఫస్ట్‌ ప్రిన్సిపాల్‌’ అనే చెక్కఫలకం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ ముచ్చటైన క్యాలిగ్రఫీ చూసి మురిసిపోతూ అద్భుతం, అమోఘం అంటూ ప్రశంసలు కురిపిస్తారు. రెండొందల సంవత్సరాల క్రితం కోసెన్‌ మాస్టర్‌ తీర్చిదిద్దిన అక్షరాలవి.

కోసెన్‌ దాన్ని మొదట కాగితం మీద రాశాడు. ఆనక అతి పెద్దగా చెక్క మీద రంగులతో తీర్చిదిద్దుతున్నాడు. అప్పుడు ఒక విద్యార్థి ఆయన పక్కనే ఉన్నాడు.  గురువు ఎలా ఉందని అడిగితే కాస్తయినా సందేహించకుండా బాగాలేదన్నాడు. గురువు మళ్లీ మళ్లీ వేసినప్పుడల్లా నదురూబెదురూ లేకుండా ‘ఇందాకటి కంటే నాసిగా ఉంది’ అంటున్నాడు. గురువు వేస్తూనే ఉన్నాడు. గ్యాలన్లకొద్దీ సిరా ఖర్చయిపోతోంది. కానీ విద్యార్థి మాత్రం సంతృప్తి చెందకపోగా ఘోరంగా విమర్శిస్తున్నాడు. అలా 84 సార్లు వేసినా అతణ్ణి ఒప్పించ లేకపోయాడు. ఇంతలో విద్యార్థి ఇప్పుడే వస్తానంటూ బయటికెళ్లాడు. కోసెన్‌కి ఊపిరాడినట్టయ్యింది. ధైర్యంగా, స్వేచ్ఛగా అనిపించింది. ‘ఇదే సరైన సమయం. ఇతడి తీక్షణమైన నిఘా చూపు నుంచి తప్పించుకునే మార్గం’ అను కున్నాడు. ఎలాంటి పరధ్యానం లేకుండా, నచ్చుతుందో లేదోననే బెంగ లేకుండా తనకు తోచినట్టు చేశాడు. కొద్ది నిమిషాల్లోనే పని పూర్తయ్యింది. లోనికి వచ్చిన విద్యార్థి ‘అద్భుతం.. అపురూపం.. కళాఖండం’ అన్నాడు.

వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు