దేవవైద్యుని ఆలయం

జీవుల వ్యాధులను, బాధలను తొలగించి ఆరోగ్యం చేకూర్చేది ఆదివైద్యుడు ధన్వంతరి. దేవదానవుల క్షీరసాగర మథనంలో స్వయంగా శ్రీమన్నారాయణుడే ఆ రూపంలో అవతరించాడు.

Published : 18 May 2023 00:09 IST

జీవుల వ్యాధులను, బాధలను తొలగించి ఆరోగ్యం చేకూర్చేది ఆదివైద్యుడు ధన్వంతరి. దేవదానవుల క్షీరసాగర మథనంలో స్వయంగా శ్రీమన్నారాయణుడే ఆ రూపంలో అవతరించాడు. ఉత్తరాదిన ధన్వంతరి ఆరాధన అధికంగా కనిపిస్తుంది. వారణాసి క్షేత్రంలో ఆ స్వామికి ఆలయముంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆలమూరు మండలంలోని చింతలూరులోనూ ధన్వంతరి ఆలయం ఉండటం విశేషం. ఆయుర్వేదానికి ఈ ఊరెంత ప్రసిద్ధమో చాలా మందికి తెలుసు కానీ ఈ గుడి గురించి పెద్దగా తెలియదు.
స్వాతంత్య్రానికి పూర్వం 1942లో చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయ వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం, రమణీయ శిల్పకళాశోభిత విమానగోపురం, విశాల ముఖమండపం నయనమనోహరంగా కనిపిస్తాయి. అంతరాలయ మండపంలో శ్రీ ధన్వంతరి నుంచి ఆయుర్వేదాన్ని నేర్చుకుని ప్రపంచానికి అందించిన బ్రహ్మదేవుడు, దక్షప్రజాపతి, అశ్వనీదేవతలు, దేవేంద్రుల శిల్పాలు ఒకవైపు, భరద్వాజ, ఆత్రేయ మహర్షి, చరక, శుశ్రుత, వాగ్భటాచార్యుల శిల్పాలు మరో వైపు కొలువుదీరి చూపరుల మనసులను మధురానుభూతికి లోనుచేస్తాయి. వీరందరికీ ధన్వంతరి స్వామే ఆయుర్వేదవిద్యను ప్రసాదించా డనేది పురాణ కథనం. గర్భాలయంలో ధన్వంతరిస్వామి శంఖం, చక్రం, అమృతకలశం, జలగలను నాలుగు హస్తాల్లో ధరించి దివ్యమనోహరంగా, దేదీప్యమానంగా రాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తాడు. ఏకశిలపై మలచిన స్వామి మూర్తిని ప్రతిష్టించారు. ఏటా కార్తిక బహుళ త్రయోదశి నాడు స్వామివారి వ్రతాన్ని అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. రావులపాలెం- కాకినాడ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చింతలూరు గ్రామానికి చేరుకోవడానికి ఉభయ తెలుగురాష్ట్రాల నుంచి రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి.

గొడవర్తి శ్రీనివాసు, న్యూస్‌టుడే, ఆలమూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు