మాయను తప్పించుకునే మార్గం!

స్వామి వివేకానంద ఓసారి విదేశాల్లో ప్రసంగిస్తూ ‘ప్రతి జీవీ భగవంతుడు పన్నిన మాయలో చిక్కుకుంటుంది. ఆ మాయ నుంచి విడివడి నప్పుడే మనిషి మనీషిగా మారేది’ అన్నారు. సభలో ఉన్న ఓ విదేశీ జిజ్ఞాసువు ‘మరి ఆ మాయ నుంచి తప్పించుకునే మార్గమే లేదా స్వామీ?’ అనడిగాడు.

Updated : 01 Jun 2023 00:32 IST

స్వామి వివేకానంద ఓసారి విదేశాల్లో ప్రసంగిస్తూ ‘ప్రతి జీవీ భగవంతుడు పన్నిన మాయలో చిక్కుకుంటుంది. ఆ మాయ నుంచి విడివడి నప్పుడే మనిషి మనీషిగా మారేది’ అన్నారు. సభలో ఉన్న ఓ విదేశీ జిజ్ఞాసువు ‘మరి ఆ మాయ నుంచి తప్పించుకునే మార్గమే లేదా స్వామీ?’ అనడిగాడు. స్వామి వివేకానంద మందహాసంతో ‘ఎందుకు లేదు? తప్పకుండా ఉంది! ఒక జాలరి చెరువులో చేపలు పట్టేందుకొచ్చాడు. అతను వల వేయగానే చేపలు ఒకటొకటిగా వచ్చి అందులో పడిపోతున్నాయి. తీరా తప్పించుకోలేక విల్లవిల్లాడుతున్నాయి. కొన్ని చేపలు మాత్రం జాలరి కాళ్లచుట్టూ తిరుగుతున్నాయి. అవి వలకు దూరంగా ఉన్నందు వల్ల చిక్కుకోలేదు. అలాగే తన లీలావిన్యాసంలో భాగంగా ఆ జగన్నాథుడు పన్నే మాయా జాలంలో మనం చిక్కుకోకుండా ఉండాలంటే ఆయన పాదాలను ఆశ్రయించాలి. అప్పుడు మాయ మనల్ని ఏమీ చేయలేదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ‘నా మాయ నుంచి తప్పించుకోవటం దుస్సాధ్యం. కానీ నన్ను ఆశ్రయించిన వారిపై నా మాయప్రభావం ఉండదు’ అని ఉద్ఘాటించాడు. అందుకే సర్వేశ్వరుడికి శరణాగతులైనవారు ప్రాపంచిక మాయలో బందీలు కారు’ అంటూ విస్పష్టం చేశారు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని