ఆలోచన మారింది!

ముహమ్మద్‌ ప్రవక్త (స) మక్కానగరంలో ఇస్లాం సందేశం చేరవేస్తున్న తొలి రోజుల్లో ఆయన్ను చాలామంది వ్యతిరేకించారు. ఎందరో ఆయనపై కత్తులు నూరేవారు. వారిలో హజ్రత్‌ ఉమర్‌ (రజి) కూడా ఉన్నారు.

Updated : 30 May 2024 00:56 IST

ఇస్లాం సందేశం

ముహమ్మద్‌ ప్రవక్త (స) మక్కానగరంలో ఇస్లాం సందేశం చేరవేస్తున్న తొలి రోజుల్లో ఆయన్ను చాలామంది వ్యతిరేకించారు. ఎందరో ఆయనపై కత్తులు నూరేవారు. వారిలో హజ్రత్‌ ఉమర్‌ (రజి) కూడా ఉన్నారు. ఒకరోజు హజ్రత్‌ ఉమర్‌ కరవాలం చేతపట్టి ముహమ్మద్‌ ప్రవక్త నివాసం వైపు బయల్దేరారు. దారిలో ఆయనకు ఒక మిత్రుడు ఎదురయ్యారు. ఉమర్‌ వాలకం చూసి అనుమానించిన ఆయన ‘ఎక్కడికి అంత కోపంగా వెళ్తున్నారు?’ అనడిగారు. బదులుగా ఉమర్‌ ‘ఈ రోజుతో ముహమ్మద్‌ ప్రవక్త (స) సమస్య పూర్తిగా పరిష్కరించేస్తాను’ అన్నారు. అది విన్న మిత్రుడు ‘ప్రవక్త సంగతి తర్వాత.. ముందు తమరి కుటుంబ విషయం చూడండి. మీ సోదరి, బావ కూడా ఇస్లాం తీసుకున్నారు తెలుసా?’ అన్నారు. దాంతో ఉమర్‌ (రజి) కోపం పట్టలేక చెల్లెలి ఇంటికి వెళ్లేసరికి.. ఆమె, ఆమె భర్త ఖురాన్‌ చదువుతున్నారు. ఉమర్‌ రావడం చూసి, వాళ్లు ఖురాన్‌ దాచేశారు. కానీ ఉమర్‌ సోదరిని, బావనూ కూడా నిర్దయగా కొట్టారు. ‘మీరెంత హింసించినా ఇస్లాం నుంచి వైదొలగం’ అంటూ స్పష్టం చేసింది సోదరి. ఆమెకి రక్తం కారడం చూసిన ఉమర్‌ కాస్త శాంతించి.. ‘ఇంతకీ మీరు చదువుతున్నదేమిటో చూపండి’ అంటే.. కాళ్లూ చేతులూ కడుక్కుని పరిశుభ్రంగా వస్తే చూపిస్తామన్నారు. ఉమర్‌ అలాగే చేశారు. ‘మేమీ ఖురాన్‌ను అవతరింపజేసింది కష్టానికి గురిచేయటానికి కాదు. ఇది భయపడే (దేవునికి) ప్రతి వ్యక్తికీ ఒక జ్ఞాపిక. ఈ నేలనీ, ఆ ఆకాశాన్నీ సృష్టించినవాని తరపు నుంచి ఇది అవతరించింది’ అనే దివ్య ఖురాన్‌లోని వాక్యాలు చదివిన తర్వాత ఉమర్‌ (రజి) ఆలోచనలో మార్పు వచ్చింది. వెంటనే ముహమ్మద్‌ ప్రవక్త (స) వద్దకు వెళ్లి ఇస్లాం స్వీకరించారాయన.

ఖైరున్నీసాబేగం 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని