వినాలి.. ఆచరించాలి..

‘చెవులున్న వ్యక్తి దైవం చెప్పేది వినును గాక’ ఇది ప్రకటన గ్రంథంలో ప్రభువు ఏడుసార్లు (ప్రక.2:7,11,17,29; ప్రక.3:6,13,22) చెప్పిన మాట. ముఖ్యమైన విషయాలను ఒకటికి రెండుసార్లు చెబుతాం. ఇంకా ప్రాధాన్యత ఉంటే పదేపదే చెబుతాం.

Published : 13 Jun 2024 00:43 IST

‘చెవులున్న వ్యక్తి దైవం చెప్పేది వినును గాక’ ఇది ప్రకటన గ్రంథంలో ప్రభువు ఏడుసార్లు (ప్రక.2:7,11,17,29; ప్రక.3:6,13,22) చెప్పిన మాట. ముఖ్యమైన విషయాలను ఒకటికి రెండుసార్లు చెబుతాం. ఇంకా ప్రాధాన్యత ఉంటే పదేపదే చెబుతాం. ఏసు ఈ విషయాన్ని ఏడుసార్లు చెప్పాడంటే.. దాని ప్రాముఖ్యతను గుర్తించాలి. ఎందుకంటే సువార్త చెవి నుంచే హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్తుంది. ప్రజలు అనుభూతి, ఓదార్పుల కోసమే చర్చికి వెళ్తారు. అక్కడ ఫాదర్‌ చెప్పిన వాక్యం విని మర్చిపోకుండా నెమరువేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. లేకుంటే అది నిష్ప్రయోజనమే. దైవవాక్యం ఖడ్గం కంటే పదునైందని బైబిల్‌ పేర్కొంది. కనుక దాని ద్వారానే మన హృదయాలు తెరుచుకుంటాయి. వినడం అంటే చెవులతో శబ్దాన్ని గ్రహించడమే కాదు, సరైన రీతిలో స్పందించడం కూడా. అపొస్తలుడైన పేతురు చెప్పిన బోధ విని, నొచ్చుకున్న విశ్వాసులు- ‘సహోదరులారా! మేమేం చేయాలి?’ అని తోటి అపొస్తలులను అడిగారు. దీన్ని బట్టి దేవుని వాక్యం ఎంత శక్తి గలదో తెలుస్తుంది. ప్రకటనలో చెప్పిన రెండో మాట ‘జయించినచో..’ అని ఉంది. అంటే జయించినవారికి ప్రభువు అనేక బహుమానాలు ప్రసాదిస్తాడు. సాధారణ వృక్షఫలాలే కాదు.. అత్యంత అరుదైనవి కూడా ఆరగించే అవకాశం కలుగుతుంది. ప్రజల మీద అధికారం ఉంటుంది. అలాగే జీవగ్రంథంలో విశ్వాసి పేరు నమోదవుతుంది. రెండో మరణం ద్వారా ఎలాంటి హానీ కలగదు. అయితే జయించడం అంత తేలికేం కాదు. అందుకు విధేయత, పట్టుదల అవసరం. ప్రభువును ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను స్వీకరించాలి. క్రైస్తవ జీవితం అంటే పాపాన్ని ఎదిరిస్తే సరిపోదు, జీవితకాలం పోరాడాలి. కనుక దీనమనస్కులై ప్రభువును నమ్మి, ఈ గొప్ప బహుమానాలు అందుకునేందుకు ప్రయత్నిద్దాం.

డా.పి.వి.ప్రసన్నకుమార్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు