సమానత్వానికి ప్రతీక హజ్‌ యాత్ర!

హజ్‌ యాత్ర.. సమానత్వ వారధి. శాంతిని ప్రతిబింబించే సర్వమానవాళి సమాహారం. సృష్టికర్తకు మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకునే ఉద్విగ్న ఘట్టం. పేద, ధనిక భేదం లేకుండా అందరూ కలిసి ఒకేచోట ప్రార్థన చేసే ధార్మిక క్షేత్రం.

Published : 13 Jun 2024 00:46 IST

హజ్‌ యాత్ర.. సమానత్వ వారధి. శాంతిని ప్రతిబింబించే సర్వమానవాళి సమాహారం. సృష్టికర్తకు మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకునే ఉద్విగ్న ఘట్టం. పేద, ధనిక భేదం లేకుండా అందరూ కలిసి ఒకేచోట ప్రార్థన చేసే ధార్మిక క్షేత్రం.

ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్ణాలు, జాతులవారు ఒకచోట చేరడం మీరెప్పుడైనా చూశారా? అసలు అలాంటి స్థలం గురించి ఆలోచించగలరా? ఆ సన్నివేశం హజ్‌ సీజన్‌లో మక్కాలో కనిపిస్తుంది. వారందరూ ఒకరి పట్ల మరొకరు హృదయపూర్వక ప్రేమతో ఉంటారు. హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం ‘జిల్‌ హజ్‌’ నెలలో ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ముస్లిములు మక్కాకు తరలివస్తారు. పేద, ధనిక, నలుపు, తెలుపు అనే తేడా లేకుండా అందరూ తెల్లని వస్త్రాలు ధరించి, కాబా గృహం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అలా నడిచేటప్పుడు మనసులో కల్మషాలూ, తరతమ బేధాలూ ఉండవు. వారంతా ప్రపంచ శాంతికోసం ప్రార్థిస్తారు. ఈ ఔన్నత్యమే మనుషులందరినీ ఒకే పంక్తిలో నిలబెడుతుంది.

హజ్‌ యాత్ర అపురూపం

ఎక్కడెక్కడి నుంచో వచ్చినవారు కాబా ప్రదక్షిణ చేస్తున్న చిత్రాన్ని చూస్తే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. 1964లో హజ్‌ సమావేశాన్ని చూసిన పౌరహక్కుల నేత మాల్కం- ‘అన్ని రంగులు, జాతుల ప్రజలు ఆచరించే హృదయపూర్వక ఈ హజ్‌ ఆరాధన నిజమైన సోదరభావానికి నిదర్శనం. ఇలాంటి సోదరభావాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిమంది యాత్రికులు వచ్చారు. వారిలో అన్ని వర్ణాలవారూ ఉన్నారు. ఈ యాత్రికుల మధ్య నెలకొన్న సామరస్యం వెనుక ప్రధాన కారణం ఏమిటో ఆలోచిస్తే.. సృష్టికర్తకు సంపూర్ణ సమర్పణను ప్రకటించాలని మీ హృదయం మీకు చెబుతుంది’ అంటూ తన మనోభావాలను వివరించారు.

మానవాళికి హజ్‌ను ప్రకటించమని ప్రవక్త ఇబ్రాహీం (స)ను ఆదేశించిన అల్లాహ్‌- ప్రజలందరినీ ఏకం చేయగలవాడు. ‘నువ్వు సమస్త భూసంపదను ఖర్చుపెట్టినా, వారి మనసులను కలపగలిగేవాడివి కాదు. కానీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ వారి మనసులను కలిపాడు. నిశ్చయంగా ఆయన మహా శక్తిమంతుడు, వివేకవంతుడు. ప్రవక్తా! నీకూ, నిన్ను అనుసరించే విశ్వాసులకూ అల్లాహ్‌ యే చాలు’ అని పేర్కొంది ఖురాన్‌.

ముస్లిమ్‌లకు హజ్‌ యాత్ర చాలా ముఖ్యమైంది. ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒకసారైనా హజ్‌ యాత్ర చేయాలి. అయితే ఇది స్తోమత ఉన్నప్పుడే వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే వివిధ జాతులకు చెందిన హజ్‌ యాత్రికులు ఒకచోట కలవడం సర్వమానవ సమానత్వం, వసుధైక కుటుంబం- అనే భావనకు సజీవ ఉదాహరణ. హజ్‌ యాత్ర సందర్భంగా ముస్లిములు అక్కడ ఖుర్బానీ ఇస్తారు.

ఆ రోజున ఉపవాసం

ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం 12వ నెల అయిన జిల్‌ హజ్‌ నెల పదో తేదీన బక్రీద్‌ పండుగ చేసుకుంటారు. పండుగకు ముందు రోజు అరఫాత్‌. ఆ రోజున ప్రపంచం నలుమూలల నుంచి హజ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులంతా అరఫాత్‌ మైదానంలో విడిది చేస్తారు కనుక ‘అరఫా’ అనే పేరు వచ్చింది. ఆ రోజున ఉపవాసం పాటించడం ప్రవక్త (స) సంప్రదాయం. అయితే హజ్‌ యాత్రలో పాల్గొనని వారు మాత్రమే ఈ ఉపవాసాన్ని పాటించాలి. ఇలా ఉపవాసం ఉన్నవారికి- రెండేళ్ల పాపాలు తుడుచుకు పోతాయన్నది విశ్వాసం. ఈ ఒక్కరోజు ఉపవాసం ఏడాది పాటించిన ఉపవాసాలకు సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఈ ‘జిల్‌ హజ్‌’ నెలలో మొదటి పది రోజులూ మరింత పవిత్రమైనవని ఖురాన్‌ పేర్కొంది. ఈ పది రోజుల్లో చేసిన పుణ్య కార్యాలు అల్లాహ్‌కు అన్నిటి కన్నా ప్రియమైనవి- అన్నారు ప్రవక్త. రంజాన్‌లో తప్పిపోయిన ఉపవాసాలను ఈ పదిరోజుల్లో పూర్తిచేసుకోవడం ఉత్తమం. ఈ పది రోజులూ విస్తారంగా దానధర్మాలు చేయాలని, అత్యంత ధర్మనిష్టతో గడపాలని, రాత్రివేళల్లో వీలైనన్ని ఎక్కువ నమాజులు చేయాలని ఉలమాలు ప్రబోధిస్తారు.

బక్రీద్‌ పండుగ పరమార్థం

ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలామ్, ఆయన పరివారం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ చేసుకునేదే ఈద్‌-ఉల్‌-జుహా లేదా బక్రీద్‌ పండుగ. ఈ రోజున ముస్లిములు ఖుర్బానీ ఇస్తారు. అంటే జంతుబలి అనుకుంటారు చాలామంది. కాని ఖుర్బానీ అంటే త్యాగం. దివ్యఖురాన్‌లో అల్లాహ్‌ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. అలా త్యాగం చేయడమే ఈ పండుగ పరమార్థం. ఇబ్రాహీం- జీవితాంతం అడుగడుగునా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. ఎన్నెన్నో త్యాగాలు చేశారు. పుత్రుడిగా, భర్తగా, తండ్రిగా, ప్రవక్తగా, విశ్వాసపాత్రుడైన దైవదాసుడిగా ఆయన తన కర్తవ్య నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఆ త్యాగశీలిని మనం ఆదర్శంగా తీసుకోవాలి.

ముహమ్మద్‌ ముజాహిద్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని