ముహర్రం... అల్లాహ్‌ నెల!

ఇస్లామ్‌ నూతన సంవత్సరానికి నాంది అయిన ముహర్రం మాసం అల్లాహ్‌ నెలగా ప్రసిద్ధి పొందింది. ముహర్రం అంటే నిషిద్ధం, పవిత్రత, మహోన్నతమైంది అనే అర్థాలున్నాయి.

Published : 11 Jul 2024 00:27 IST

జులై 17 ముహర్రం

పన్నెండు ఇస్లామిక్‌ నెలల్లో మొట్టమొదటిది ముహర్రం. ఖురాన్‌ పేర్కొన్న నాలుగు పవిత్ర నెలల్లో ఇదొకటి. ముహర్రం నెలవంక దర్శనంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఇస్లామ్‌ నూతన సంవత్సరానికి నాంది అయిన ముహర్రం మాసం అల్లాహ్‌ నెలగా ప్రసిద్ధి పొందింది. ముహర్రం అంటే నిషిద్ధం, పవిత్రత, మహోన్నతమైంది అనే అర్థాలున్నాయి. అల్లాహ్‌ దివ్య ఖురాన్‌లో ముహర్రం నెల వైశిష్ట్యాన్ని వివరించారు. ‘రంజాన్‌ నెలతో పాటు వేరే ఏ నెలలో ఉపవాసాలు పాటించాలి?’ అని పవక్త(స)ను అడిగాడో శిష్యుడు. అప్పుడు ప్రవక్త ‘ఉపవాసాలు పాటించదలచు కున్నవారు రంజాన్‌ ఉపవాసాల తరవాత ముహర్రం ఉపవాసాలు పాటించండి. ఎందుకంటే ఇది అల్లాహ్‌ నెల. యౌమె ఆషూరా రోజు ఉపవాసానికి ఎంతో విశిష్టత, ఔన్నత్యం ఉన్నాయి’ అని బదులిచ్చారు. ముహర్రం నెల 10వ తేదీని యౌమె ఆషూరా అంటారు. ఆ రోజున ఉపవాసం పాటించడం వల్ల గతేడాది చేసిన పాపాలన్నీ తుడిచి పెట్టుకుపోతాయి. ఇస్లామీయ చరిత్రలో ఎంతో పవిత్రత, ప్రాధాన్యత ఉన్న యౌమె ఆషూరా రోజునే హజ్రత్‌ ఇమామె హుసేన్‌ (రజి) అమరులయ్యారు. ఆ రోజు ముస్లిములు హుసైన్‌ (రజి) త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటారు. వందల ఏళ్ల క్రితం ధర్మంకోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇమామె హుసేన్‌ (రజి) ‘కర్బలా’ మైదానంలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన ఘటనను గుర్తుచేసుకుంటారు. 

హిజ్రీ కాలెండర్‌ ఇలా మొదలైంది...

హిజ్రీ శకం 16 లేదా 17వ సంవత్సరంలో హజ్రత్‌ ఉమర్‌ ఫారూఖ్‌ (రజి) పాలనా కాలంలో రాజ్యాన్ని విస్తరించేందుకు లేఖలు రాసే, ఫర్మానాలు జారీచేసే అవసరం బాగా పెరిగింది. ముస్లిములు ఆచరించాల్సిన పనులన్నింటినీ ఇస్లామీ కాలెండర్‌కు అనుగుణంగా కొనసాగించాలని ఉమర్‌ ఆలోచించారు. ఈ విషయంలో హజ్రత్‌ అలీ(రజి) సలహా ఖలీఫాకు బాగా నచ్చింది. ముహమ్మద్‌ ప్రవక్త మక్కాను వదిలి మదీనాకు వలస వెళ్లిన ఏడాదితో ఇస్లామీ కాలెండరును ప్రారంభించాలన్న సలహా నచ్చడంతో హిజ్రీ శకం ప్రారంభించారు. హిజ్రత్‌ అంటే వలస వెళ్లడం అని అర్థం. ప్రవక్త చేపట్టిన ఇస్లామీయ ఉద్యమానికి కీలక మలుపుగా హిజ్రత్‌ ప్రయాణం నిలుస్తుంది. ఆయనకు ముందు సంవత్సరాలను శూన్యంగా పరిగణించి, హిజ్రత్‌ ప్రయాణించిన ఏడాదిని మొదటి సంవత్సరంగా ఎంచి కాలెండర్‌ రూపొందించారు. ఇక పన్నెండు అరబ్బీ నెలల్లో ఏ నెలను మొదటి, చివరి మాసంగా కూర్పు చేయాలన్న ప్రశ్న తలెత్తింది. దీంతో ప్రాచీన కాలెండర్లన్నింటిలో ముహర్రంను మొదటి నెలగా పరిగణించడం ఆనవాయితీగా ఉన్నందువల్ల, దాన్నే మొదటి మాసంగా ప్రకటించారు. అలా హిజ్రీ కాలెండర్‌ ప్రారంభమైంది. ఇంగ్లీషు కాలెండర్‌లో ఏడాదిలో 365 రోజులుంటే.. హిజ్రీ కాలెండర్‌లో 354 రోజులుంటాయి. నెలల సంఖ్య పన్నెండే అయినప్పటికీ ఆంగ్ల కాలెండర్‌లా కాకుండా హిజ్రీ కాలెండర్‌లో నెలలో 29 లేదా 30 రోజులుంటాయి. ముస్లిములు తమ ధార్మిక అవసరాలకు చాంద్రమాన కాలెండర్‌నే అనుసరిస్తారు. ఇస్లామిక్‌ నెలలన్నీ నెలవంక దర్శనంతోనే ప్రారంభమవుతాయి. ఈదుల్‌ ఫిత్ర్, ఈదుల్‌ అజ్హా పండుగలు కూడా నెలవంక దర్శనంమీదే ఆధారపడి ఉంటాయి.

ముహమ్మద్‌ ముజాహిద్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని