చివరకు మిగిలేది?

దిన యామిన్యౌ సాయం ప్రాతఃశిశిర వసన్తౌ పునరాయాతఃకాలం క్రీడతి గచ్ఛత్యాయుఃతదపి న ముంచ త్యాశా వాయుః...పగలు, రాత్రి.. ఉదయం, సాయంత్రం.. శిశిరం, వసంతం వస్తూ  పోతూ ఉంటాయి. కాలం ఆడే ఆటలో ఆయువు తరిగిపోతూ ఉంటుంది. అయినా మానవుడు ఆశను మాత్రం వదిలిపెట్టడం లేదు.

Published : 16 Jul 2020 14:55 IST

భజగోవిందం

దిన యామిన్యౌ సాయం ప్రాతః
శిశిర వసన్తౌ పునరాయాతః
కాలం క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచ త్యాశా వాయుః...
పగలు, రాత్రి.. ఉదయం, సాయంత్రం.. శిశిరం, వసంతం వస్తూ  పోతూ ఉంటాయి. కాలం ఆడే ఆటలో ఆయువు తరిగిపోతూ ఉంటుంది. అయినా మానవుడు ఆశను మాత్రం వదిలిపెట్టడం లేదు.

- జగద్గురు ఆది శంకరుల భజగోవిందం నుంచి

ఒక అభాగ్య బ్రాహ్మణుడు పేదరికంలో బాధ పడుతూ తన గ్రామానికి వచ్చిన సాధుపుంగవుణ్ణి సందర్శించుకుని తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఎన్నో మహిమలున్న ఆ స్వామీజీ ఆ దీనార్తుడి కష్టానికి కరిగిపోయి ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాడు. కళ్లు మూసుకుని తన దివ్య దృష్టితో ఆ రాజ్యంలోని ఓ అటవీ ప్రాంతంలో నాణాల రాశులున్నాయని తెలుసుకుంటాడు. వెంటనే ఆ పేద బ్రాహ్మణుణ్ణి అక్కడకు వెళ్లి, తనకు కావాల్సినంత సొమ్ము తెచ్చుకుని హాయిగా జీవించమని ఉపదేశించాడు. ఆ సాధువు మాట ప్రకారమే బ్రాహ్మణుడు ఆ చోటుకు వెళ్లి తన కుటుంబానికి కావాల్సినన్ని నాణాలు తెచ్చుకుని తృప్తిగా జీవించాడు. ఈ విషయం అతని ఇంటి పక్కనున్న మరో వ్యాపారికి తెలిసింది. శ్రీమంతుడే అయినా అతనికి దురాశ పుట్టుకొచ్చింది. నిరుపేదగా వేషం వేసుకుని, సాధువు వద్ద దీనంగా ధనం కోసం అర్థించాడు. సాధువుకు అతని దుర్బుద్ధి అర్థమైంది. వందల మైళ్ల దూరంలో నాణాల నిధుల జాడ చెప్పాడు. ఒక రోజు ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా బయల్దేరి వెళ్లిపోయాడు. ఎంతో శ్రమకోర్చి అక్కడకు చేరుకున్నాడు. అక్కడ రాజముద్రికలున్న నాణాల రాశులను చూసి మంత్రముగ్దుడయ్యాడు. వాటిని సంచుల్లో నింపుకుని మూటకట్టుకోవడం మొదలుపెట్టాడు. ఎన్ని మూటలు కడుతున్నా ఆశ తీరడం లేదు. ఇలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. యుక్త వయసులో అక్కడ అడుగుపెట్టిన వ్యాపారికి వృద్ధాప్యం వచ్చింది. చివరకు తన శక్తికి మించిన నాణాల బస్తాలను తీసుకుని గ్రామానికి వచ్చాడు. అప్పటికే అతని అయిన వాళ్లందరూ కళ్లుమూశారు. తోటివారు ఇతన్ని గుర్తుపట్టలేకపోయారు. రాజ్యాలు మారిపోయి ఆ నాణాలు కూడా చెల్లుబాటు కాకుండా అయిపోయాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు