దివ్య తేజోరూపం నయనానందం!

భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో కొలువుదీరిన దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి మూలవిరాట్టుకు ప్రతిబింబం...

Published : 22 Apr 2021 00:28 IST

ఈ నెల 24 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవం

భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో కొలువుదీరిన దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి మూలవిరాట్టుకు ప్రతిబింబం - ఉత్సవమూర్తి శ్రీమలయప్పస్వామి! మూలవిరాట్టు ప్రతినిధిగా ఈ స్వామికి జరిగే సేవల్లో వసంతోత్సవం ఒకటి. వసంత రుతువులో ఎండల వేడి అధికమయ్యే సమయంలో శ్రీనివాసుడు ఇరువురు దేవేరులతో కలిసి ఉద్యానవనాల్లో విహరిస్తూ, దివ్య స్నానాలు అందుకోవటమే వసంతోత్సవం. క్రీ.శ.1360 నుంచి సాగుతున్నట్టు చెప్పే ఈ ఉత్సవం ఏటా చైత్ర మాసంలో పౌర్ణమికి ముగిసేలా మూడు రోజుల పాటు జరుగుతాయి. వసంతోత్సవం ప్రారంభం రోజు యథావిధిగా సుప్రభాతం, తోమాలసేవాదుల తర్వాత శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్పస్వామి ఆనంద నిలయం నుంచి ఊరేగింపుగా ఆలయం వెనుక ఉన్న వసంతోత్సవ మండపానికి చేరుకుంటారు. మధ్యాహ్నం వరకు రంగురంగుల పుష్పాలు, తీగలతో అలంకరించిన వసంత మండపంలో సేదతీరతారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దేవేరులతో వసంతాలు ఆడతారు. వేదపండితులు శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామిని తొలుత శుద్ధజలం, తర్వాత ఆవుపాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు నీళ్లు, మధ్యలో మళ్లీ శుద్ధజలంతో అభిషేకిస్తారు. స్వామి, అమ్మవార్లకు చందనం అద్దుతారు. తిలకాన్ని తీర్చిదిద్ది తులసి మాలలు అలంకరింపజేసి ధూప దీప హారతులిస్తారు. బంగారు జల్లెడతో సహస్ర ధారల అభిషేకం చేస్తారు. రెండో రోజూ ఇవే కార్యక్రమాలు ఉంటాయి. మూడో రోజు త్రేతా యుగం నాటి రాముణ్ని, ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుణ్ని నేనేనని స్పష్టంచేస్తూ సీతారామ లక్ష్మణ ఆంజనేయ, రుక్మిణీ సమేత శ్రీకృష్ణుల మధ్య స్వామివారు అభిషేకాలు అందుకుంటారు. రెండో రోజు స్వర్ణ రథాన్ని అధిరోహించి విహరిస్తారు. వసంతోత్సవంలో దివ్య తేజో రూపుడైన స్వామి వారి దర్శనం సకల శ్రేయోదాయకం.

- ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు