అద్దంలో ఎందుకు చూసుకోవాలి?

సోక్రటీస్‌ గొప్ప గ్రీకు తత్త్వవేత్త. ప్లేటో వంటి శిష్యులకు ఆరాధ్యనీయుడు. కానీ ఏమంత అందమైన వ్యక్తి కాదు. ఓరోజు ఆయన అద్దంలో ముఖం చూసుకుంటున్న సమయంలో ఒక శిష్యుడు వచ్చాడు. మహామేధావి, సత్యశోధకుడు అయిన తన గురువు నిశితంగా అద్దంలో ముఖాన్ని చూసుకోవటం ఆశ్చర్యం

Updated : 27 Jan 2022 05:28 IST

సోక్రటీస్‌ గొప్ప గ్రీకు తత్త్వవేత్త. ప్లేటో వంటి శిష్యులకు ఆరాధ్యనీయుడు. కానీ ఏమంత అందమైన వ్యక్తి కాదు. ఓరోజు ఆయన అద్దంలో ముఖం చూసుకుంటున్న సమయంలో ఒక శిష్యుడు వచ్చాడు. మహామేధావి, సత్యశోధకుడు అయిన తన గురువు నిశితంగా అద్దంలో ముఖాన్ని చూసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. లోలోపలే నవ్వుకున్నాడు. అతని ఆంతర్యాన్ని గ్రహించిన సోక్రటీస్‌ ‘నువ్వెందుకు నవ్వావో అర్థమైంది. అందంగా లేనప్పుడు అద్దంలో చూసుకోవటం ఎందుకు అనుకుంటున్నావా?!’ అన్నాడు. దాంతో శిష్యుడు జవాబు చెప్పలేక సిగ్గుతో తల దించుకున్నాడు. ‘నేను ఎందుకు చూసుకుంటున్నానో తెలుసా?! నా ముఖాన్ని చూడసొంపుగా ఎలాగూ సవరించుకోలేను. ఆ లోపాన్ని అధిగమించేందుకు అపార జ్ఞానాన్ని సంపాదించాలని, గొప్ప పనులతో గుర్తింపు పొందాలని ఆశిస్తాను. తాత్కాలికమైన అందం కన్నా మేధస్సే శాశ్వతమని నా మనసుకు చెప్పుకుంటాను’ అన్నాడు. ఆ మాటలకు శిష్యుడు ఆశ్చర్యపోయాడు. అంతలోనే మరో సందేహం కలిగింది. ‘అయితే అందమైనవాళ్లు అద్దంలో చూసుకోనక్కర్లేదా?’ అనడిగాడు. సోక్రటీస్‌ నవ్వి ‘వాళ్లు కూడా అద్దంలో చూసుకోవాలి. చూసుకుంటూ, తమ అందానికి తగ్గట్టు అందమైన పనులు చేయాలని నిర్ణయించుకోవాలి. లేదంటే వారి దుష్కర్మలు ఆ సౌందర్యానికి మచ్చను తెస్తాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి’ అన్నాడు. రామకృష్ణ పరమహంస కూడా ఒక సందర్భంలో ‘అమ్మా! నాకు బాహ్యసౌందర్యం అవసరం లేదు, ఆధ్యాత్మిక చింతనతో కూడిన అంతఃసౌందర్యాన్ని ప్రసాదించు’ అంటూ కాళీమాతను ప్రార్థించాడు. 

- చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని