కుక్కకు అవమానం.. చివరికి సన్మానం

మహాభారత గాథ కుక్కకు జరిగిన అవమానంతో మొదలై దానికి సన్మానం చేయడంతో ముగుస్తుందంటే ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది ముమ్మాటికీ నిజం. దీనికి సంబంధించిన కథ ఆదిపర్వంలో ఉంది.

Published : 17 Feb 2022 00:31 IST

హాభారత గాథ కుక్కకు జరిగిన అవమానంతో మొదలై దానికి సన్మానం చేయడంతో ముగుస్తుందంటే ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది ముమ్మాటికీ నిజం. దీనికి సంబంధించిన కథ ఆదిపర్వంలో ఉంది. ధర్మరాజు మునిమనవడైన జనమేజయుడు యాగం చేస్తుండగా.. ఆ యాగ స్థలికి సారమేయ అనే కుక్క వచ్చింది. దేవతల శునకమైన సరమ దీనికి తల్లి. కుక్క గలాటా చేస్తుందేమోననే భయంతో జనమేజయుడి తమ్ముళ్లు, కుమారులు సారమేయను కొట్టారు. ఆ దెబ్బల బాధతో అది కాస్తా తల్లి వద్దకు వెళ్లి జనమేజయుడి పరివారం తనను అకారణంగా దండించిందంటూ ఏడ్చింది. తల్లి హృదయం ద్రవించి, ‘నువ్వేమీ తప్పు చేయకున్నా ఎందుకు దండిస్తారు?! పద రాజునే న్యాయం అడుగుదాం’ అని బిడ్డను వెంటబెట్టుకొని రాజాస్థానానికి బయల్దేరింది సరమ. సభాస్థలిలో అందరూ చూస్తుండగా న్యాయం చెప్పమని జనమేజయుణ్ణి నిలదీసింది. అదిలించినంతలో పారిపోయే తమను మీ వాళ్లు కొట్టి తప్పు చేశారని వాదించింది. ‘ఇది తగును, ఇది తగదు అని ఆలోచించకుండా పేదవారికి, బలహీన వర్గాలకు, అమాయక మూగ ప్రాణులకు, సాధు స్వభావులకు ఎవరైతే అపకారం తలపెడతారో వారిని అకారణ భయాలు వేధిస్తాయి’ అంటూ శపించింది. ఆ తర్వాతే జనమేజయుడు సర్పయాగం చేశాడు. మనసులో భయం, విచారం, ఆందోళనలు కలిగాయి. ఈ మానసిక అశాంతిని తొలగించుకోవడానికే భారతం విన్నాడు. అలా మహాభారత గాథ మొదలవుతుంది. తిరిగి స్వర్గారోహణ పర్వంలో ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మార్గమధ్యంలో తనువు చాలించగా.. ఒంటరిగా స్వర్గానికి వెళ్తున్న ధర్మరాజును ఓ కుక్క అనుసరించి చివరి వరకు తోడుగా నిలిచింది. దేవతలు వచ్చి ధర్మరాజును విమానం ఎక్కమంటే ‘నా భార్య, సోదరులు పడిపోయారు. హిమాలయ మార్గంలో ఇక్కడి దాకా వచ్చానంటే ఈ కుక్క తోడుగా ఉండటం కూడా ఓ కారణం. ముందు ఈ మూగజీవాన్ని ఎక్కనివ్వండి! తర్వాత నేను ఎక్కుతాను’ అంటూ కుక్కను గౌరవించాడు. అలా మహాభారతం ముగుస్తుంది.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు