కప్ప కూడా గురువే

ఓ సాయంత్రం తాత్యా విచారంగా సాయి వద్దకు వచ్చాడు. ‘ఈ వేళప్పుడు ఇంటికెళ్లకుండా ఇక్కడికొచ్చావేంటి? ఏమైంది?’ అన్నాడు సాయి. ‘నా మిత్రుడు కేశవ్‌ని ఎంత ప్రయత్నించినా బాగు చేయలేనేమోనని బాధగా, భయంగా ఉంది.

Published : 17 Feb 2022 00:41 IST

సాయంత్రం తాత్యా విచారంగా సాయి వద్దకు వచ్చాడు. ‘ఈ వేళప్పుడు ఇంటికెళ్లకుండా ఇక్కడికొచ్చావేంటి? ఏమైంది?’ అన్నాడు సాయి. ‘నా మిత్రుడు కేశవ్‌ని ఎంత ప్రయత్నించినా బాగు చేయలేనేమోనని బాధగా, భయంగా ఉంది. అతని మానాన అతన్ని వదిలేయడమే మంచిదనిపిస్తోంది’ అన్నాడు తాత్యా. అంతలో కప్పల శబ్దం వినిపించింది. ‘మండు వేసవి కదా, కప్పలకు ఏదో కష్టం వచ్చి ఉంటుంది. పద, ఏమిటో చూద్దాం’ అన్నాడు సాయి. కొద్ది దూరంలోనే అవి కనిపించాయి. ఓ కప్ప గోతిలో పడిపోయి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కానీ పైకి ఎక్కలేక నిస్సహాయంగా అరుస్తోంది. అంచునున్న కప్ప మళ్లీ ప్రయత్నించమన్నట్టుగా అరుస్తోంది.

కొద్దిసేపటికి గోతిలోని కప్ప పైకి రాగా, రెండూ ఆనందంగా గెంతుకుంటూ వెళ్లిపోయాయి. అదంతా గమనించిన సాయి ‘తాత్యా! ఇప్పుడు నీ సమస్యకు సమాధానం దొరికిందా’ అన్నాడు.

‘నా సమస్యకీ, ఈ కప్పలకీ పోలికేంటి?’ అడిగాడు తాత్యా. ‘చెబుతా విను! గోతిలో పడిన కప్ప సమస్యల్లో ఉన్న నీ స్నేహితుడు కేశవ్‌. పైనుంచి స్నేహితుణ్ణి కాపాడటానికి చూస్తోన్న కప్పవి నువ్వే. మిత్రుడి గురించి నువ్వు దిగులుపడటం సహజమే. సమస్యల్లో ఉన్న స్నేహితులను ఎట్టి పరిస్థితిలో వదిలి వెళ్లకూడదు. మన చుట్టూ ఉన్న చెట్టుపుట్టలు, జీవజాలం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉంటాయి. కానీ మనకి శ్రద్ధ, ఓర్పు లేకపోవడం వల్ల ఆ సత్యాలను గ్రహించక వదిలేస్తుంటాం. అందుకే ప్రకృతి మన తొలి గురువు. నిరంతరం ప్రకృతిని పరిశీలిస్తే ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు’ అన్నాడు సాయి.

- డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు