మరణం తర్వాత...

ఓ అమాయకురాలి భర్త చనిపోయాడు. అతడు స్వర్గానికి వెళ్లాడో లేక నరకానికి వెళ్లాడో తెలుసుకోవాలనుకుందామె. కారణం అతడు బతికి ఉన్నంతకాలం అందర్నీ ఇబ్బంది పెట్టాడు. తనను కూడా కొట్టి తిట్టేవాడు.

Published : 07 Apr 2022 00:55 IST

ఓ అమాయకురాలి భర్త చనిపోయాడు. అతడు స్వర్గానికి వెళ్లాడో లేక నరకానికి వెళ్లాడో తెలుసుకోవాలనుకుందామె. కారణం అతడు బతికి ఉన్నంతకాలం అందర్నీ ఇబ్బంది పెట్టాడు. తనను కూడా కొట్టి తిట్టేవాడు.
ఆమె ఆలోచనలో ఉండగా సోది చెబుతానంటూ వచ్చిందో సోదెమ్మ. అమాయకురాలు చేట నిండా బియ్యం పోసి ‘అమ్మా! చనిపోయిన నా భర్త స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో చెప్పు’ అంది. సోదెమ్మ కళ్లు మూసుకుని దేవతను స్మరించగానే పూనకం వచ్చినట్లు ఊగుతూ ‘అడుగు తల్లీ అడుగు’ అంది. ‘ఏవండీ! మీరు అక్కడ హాయిగా ఉన్నారా?’ అనడిగింది అమాయకురాలు. ‘ఆ.. సంతోషంగా ఉన్నాను. ఆకాశం నీలంగా ఉంది. చుట్టూ చెట్లున్నాయి. సూర్యుడు తీక్షణంగా లేడు. స్వచ్ఛమైన చల్ల గాలి వీస్తోంది. తిని పడుకోవడం తప్ప వేరే పనిలేదు’ అన్నాడు భర్త.
‘అయితే స్వర్గంలో ఉన్నారన్నమాట’ అందామె.
‘స్వర్గం అంటావేంటి? నేను శ్రీశైలం అడవుల్లో పిల్లిగా పుట్టాను. ధర్మబద్ధంగా ప్రవర్తించనివాళ్లకు మరణించాక జంతుజన్మ లభించడం పరిపాటి. ఈ సంగతి
రజసి ప్రలయం గత్వా
కర్మ సంగిషు జాయతే
తథా ప్రలీనస్తమసి
మూఢయోనిషు జాయతే

అంటూ కృష్ణపరమాత్ముడే భగవద్గీత పద్నాలుగో అధ్యాయం పదిహేనో శ్లోకంలో చెప్పాడు కదా.. తమోగుణం వృద్ధి చెందినప్పుడు మృతిచెందిన మనిషి పశు, పక్షి కీటకాదులుగా జన్మిస్తాడని.. నా గతీ అదే’ అన్నాడు.

- సాయి అనఘ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని