ఎవరు మహాదాత?

శ్రీకృష్ణునికి ప్రియసఖుడైన అర్జునుడు ఒకసారి ‘బావా! నేనూ దానధర్మాలు చేస్తూనే ఉన్నాను. కానీ కర్ణుడి ఖ్యాతి మాత్రం నాకు దక్కడంలేదు. అందరూ కర్ణుడినే ఎందుకు మహాదాతగా పొగుడు తున్నారు?’ అని వాపోయాడు. అర్జునునికి కర్ణునిదానగుణాన్ని విశదపరచాలనుకున్న శ్రీకృష్ణుడు మర్నాడు

Updated : 07 Apr 2022 04:44 IST

శ్రీకృష్ణునికి ప్రియసఖుడైన అర్జునుడు ఒకసారి ‘బావా! నేనూ దానధర్మాలు చేస్తూనే ఉన్నాను. కానీ కర్ణుడి ఖ్యాతి మాత్రం నాకు దక్కడంలేదు. అందరూ కర్ణుడినే ఎందుకు మహాదాతగా పొగుడు తున్నారు?’ అని వాపోయాడు. అర్జునునికి కర్ణునిదానగుణాన్ని విశదపరచాలనుకున్న శ్రీకృష్ణుడు మర్నాడు ఒక పోటీ ఏర్పాటు చేశాడు. రెండు గజాల ఎత్తున్న ఒక బంగారు కొండను, మరో వెండి కొండను సృష్టించి ‘అర్జునా! ఈరోజు సాయంత్రంలోపు ఈ రెండు కొండలను గనుక నువ్వు దానం ఇవ్వగలిగితే నిన్ను కర్ణునితో సమానంగా మహాదాతగా పరిగణిస్తాను’ అన్నాడు. అర్జునుడు దానమిస్తున్న సంగతి చాటింపు వేసి బంగారం, వెండి ముక్కలు ముక్కలు చేసి అందరికీ దానమివ్వడం ప్రారంభించాడు. సూర్యాస్తమయానికి సగం సగం కొండలు మాత్రమే దానమివ్వగలిగాడు.
మరుసటిరోజు కర్ణుణ్ణి పిలిపించి ‘కర్ణా! సాయంత్రంలోపు ఆ కొండలను రెండింటినీ దానమివ్వు!’ అన్నాడు శ్రీకృష్ణుడు. కర్ణుడు వెంటనే దారిన వెళ్తున్న ఇద్దరు పేదలను పిలిచి ‘అయ్యలారా! మీరు ఈ కొండలలో చెరొకటి తీసుకుని, ఇద్దరూ ఐశ్వర్యవంతులు కావాలని ఆశిస్తున్నాను’ అంటూ వారికి నమస్కరించాడు. వాళ్లు చెరో కొండను బండ్లపై ఎక్కించుకుని సంతోషంగా వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడు ‘చూశావా అర్జునా! నువ్వు కొండలను ముక్కలు ముక్కలుగా చేసి దానమిచ్చావు. కర్ణుడు కొండలను మొత్తంగా ఒకేసారి దానమిచ్చాడు. నీకూ కర్ణుడికీ ఉన్న తేడా అదే! అందుకే కర్ణుడు మహాదాతగా కీర్తి అందుకుంటున్నాడు’ అన్నాడు.

- టేకుమళ్ల వెంకటప్పయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని