పంచ నిధులు

పూర్వం ఒక నిరుపేద కష్టాలకు తాళలేక ఆశ్రమంలో నివాసం ఉంటోన్న ముని వద్దకు వెళ్లాడు. తన పరిస్థితి గురించిచెప్పి ‘స్వామీ! నేనెందుకింతగా పేదరికంతో బాధ పడుతున్నాను? భగవంతుడికి అందరూ

Published : 12 May 2022 01:12 IST

పూర్వం ఒక నిరుపేద కష్టాలకు తాళలేక ఆశ్రమంలో నివాసం ఉంటోన్న ముని వద్దకు వెళ్లాడు. తన పరిస్థితి గురించిచెప్పి ‘స్వామీ! నేనెందుకింతగా పేదరికంతో బాధ పడుతున్నాను? భగవంతుడికి అందరూ సమానమే అంటారు. మరి కొందర్ని ధనికులుగా కొందర్ని నిరుపేదలుగా ఎందుకు పుట్టిస్తున్నాడు?’ అనడిగాడు. ఆ ముని చిరునవ్వు నవ్వి ‘నాయనా! మనం గతజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా జన్మలు కలుగుతుంటాయి. గత జన్మలలో దానధర్మాలు చేయకుండా కఠినంగా ప్రవర్తించినందున ఇలా జరిగింది’ అంటూ చెప్పాడు. ‘అయ్యా! నేనీ జన్మలో దానధర్మాలు చేస్తే కదా.. మరు జన్మలో ధనికుడిగా పుడతాను! కానీ ధనం లేకుండా దానమేం చేయను? అంటే అన్ని జన్మల్లో ఇలా జన్మించాల్సిందేనా?’ అన్నాడు. ముని తల పంకించి ‘నీవద్ద ధనం లేకుంటేనేం పంచనిధులున్నాయి. వాటిని పంచు, సద్గతులు లభిస్తాయి’ అన్నాడు. ‘తిండికే లేక బాధపడుతుంటే పంచ నిధులా?’ అన్నాడతడు. ‘చిరునవ్వు తొలి నిధి. ఉచితంగానే లభిస్తుంది. దాంతో ప్రపంచానికి ఆనందాన్నివ్వొచ్చు. రెండో నిధి కళ్లు. వాటితో ప్రేమాభిమానాలనే అద్భుతాలను పండించి పంచవచ్చు. మూడోది నాలుక. మంచీ చెడూ అన్నిటికీ అదే కారకం. ఆత్మీయంగా మాట్లాడు. నాలుగోది హృదయం. హృద్యంగా స్పందిస్తూ కఠినాత్ములను కూడా ప్రేమాస్పదంగా మార్చవచ్చు. ఆఖరి సంపద శరీరం. దాంతో ఎందరికో సాయం చేయొచ్చు. వీటిల్లో దేనికీ ధనంతో ప్రమేయం లేదు. అది నీ అవసరాలను తీరుస్తుంది. నువ్విలా చేసి చూడు.. వెలుగులు పూయించినట్లవుతుంది. నీ శరీరమే సర్వోత్తమమైంది. అయినదానికీ కానిదానికీ నువ్వు ఏడుస్తూ ఇతరులను ఏడిపించక జన్మను చరితార్థం చేసుకో’ అంటూ ముని జ్ఞానబోధ చేశాడు.                     

- టి.దుర్గాపల్లవి  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని