బుద్ధిని ప్రచోదనం చేసే ఉద్ధవగీత

గీత అనగానే భగవద్గీత గుర్తుకురావటం సహజం. అయితే భారత, భాగవతాదుల్లో అలాంటి గీతలు చాలానే ఉన్నాయి. వాటిలో ఉద్ధవగీత ప్రధానమైనది. పన్నెండు స్కందాల భాగవతంలో ఆత్మోన్నతి కలిగించే ఆధ్యాత్మిక విషయాలనేకం.

Published : 09 Jun 2022 01:23 IST

గీతలెన్ని?!

గీత అనగానే భగవద్గీత గుర్తుకురావటం సహజం. అయితే భారత, భాగవతాదుల్లో అలాంటి గీతలు చాలానే ఉన్నాయి. వాటిలో ఉద్ధవగీత ప్రధానమైనది. పన్నెండు స్కందాల భాగవతంలో ఆత్మోన్నతి కలిగించే ఆధ్యాత్మిక విషయాలనేకం. పదకొండో స్కందం మరీ విశిష్టం. ఇది ఆసక్తికర కథలతో, చక్కటి ఉదాహరణలతో ఉంటుంది. ఎన్నెన్నో ధర్మసందేహాలకు సమాధానాలిస్తుంది. భగవద్గీతలో లాగానే ఇక్కడా శ్రీకృష్ణుడే వక్త. అక్కడ శ్రోత అర్జునుడు, ఇక్కడ ఉద్ధవుడు. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అని భక్తులు నాలుగు రకాలుగా ఉంటారు. ఉద్ధవుడిది రెండోరకం. బ్రహ్మవిద్య జిజ్ఞాస ఉన్నవాళ్లకే బోధించాలన్నది శాస్త్రం. తెలుసుకోవాలన్న కోరికే జిజ్ఞాస. అది పరిపూర్ణంగా ఉన్న ఉద్ధవుడు శ్రోత కావడం వల్ల ఈ ఘట్టానికి ప్రాధాన్యత వచ్చింది. ఇందులో అవధూతోపాఖ్యానం, పింగళోపాఖ్యానం వంటి విషయాలు, భగవద్విభూతుల వర్ణన కనిపిస్తాయి. భగవద్గీతలో ధర్మసంస్థాపనార్థకమైన కర్తవ్యనిష్ఠ సమస్త మానవాళికి విద్యుక్త ధర్మాన్ని చాటింది. ఉత్తరగీత, శివగీత వంటివెన్నో ఉన్నాయి. భాగవతంలో కథాసందర్భాన్ని బట్టి భ్రమరగీత, గోపికాగీత, లాంటి గీతలున్నాయి. వాటిల్లో భగవద్గీత పక్కన నిలువతగింది ఉద్ధవగీత. శ్రీకృష్ణావతార పరిసమాప్తికి ముందు ఆయన అంతిమోపదేశమిది. ఉద్ధవుడి సందేహాలను కృష్ణుడు నివృత్తి చేస్తాడు. బద్ధపురుషుడికీ, ముక్త పురుషుడికీ చాలా వ్యత్యాసం ఉంటుందంటుంది ఉద్ధవగీత. ఆ సందర్భంలోనే ముక్తపురుషలక్షణాలను స్పష్టంగా, వివరణాత్మకంగా చెప్పాడు. ఉద్ధవగీతలో యదువుకు దత్తాత్రేయుడు చెప్పిన గీత కూడా ఉంది. అదే అవధూతగీత. ఉద్ధవుడి కోరిక మేరకు మానవాళి బుద్ధి వికాసం కోసం దీన్ని చెప్పాడు కృష్ణుడు.

- మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని