విధిరాత మారుతుందా?

విధిరాత అంటే బ్రహ్మదేవుడు రాసిన రాత. ‘భగవంతుడు కష్టసుఖాలను, జనన మరణాలను ముందే నిర్ణయిస్తాడు కదా! అలాంటి విధిరాతను పుణ్య కార్యాలతో మార్చుకోవడం సాధ్యమవుతుందా?’ అనే ధర్మసందేహం చాలామందికి వస్తుంటుంది. అది సాధ్యమే నంటున్నాయి పురాణాలు...

Updated : 28 Jul 2022 01:06 IST

విధిరాత అంటే బ్రహ్మదేవుడు రాసిన రాత. ‘భగవంతుడు కష్టసుఖాలను, జనన మరణాలను ముందే నిర్ణయిస్తాడు కదా! అలాంటి విధిరాతను పుణ్య కార్యాలతో మార్చుకోవడం సాధ్యమవుతుందా?’ అనే ధర్మసందేహం చాలామందికి వస్తుంటుంది. అది సాధ్యమే నంటున్నాయి పురాణాలు...

పూర్వం ఒక మహా ముని ఉండేవాడు. ముఖం చూసి భూత, భవిష్యత్, వర్తమాన- కాలాలను చెప్పగల శక్తి ఉండేదాయనకు. ఒకరోజు తన శిష్యుల్లో ఒకడైన సంతోషానందను చూడగానే అతడికి మరణకాలం ఆసన్నమైందని అర్థమైంది. దగ్గరకు పిలిచి ‘కొద్దికాలం ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను సేవించి సంతోషంగా ఉండు’ అంటూ పంపించాడు. కొన్నాళ్లకు అతడు మరణించి ఉంటాడనుకున్నాడు ముని. కానీ మూడు మాసాల తర్వాత శిష్యులు ‘గురువు గారూ! సంతోషానంద ఆశ్రమానికి తిరిగొచ్చాడు’ అంటూ వెంటబెట్టుకొచ్చారు. ముని ఆశ్చర్యంగా దగ్గరకు పిలిచి మళ్లీ ముఖం చూశాడు. నిండు నూరేళ్లు బతుకుతాడని అర్థమైంది. ‘నాయనా! ఆరోజు ఏం జరిగిందో చెప్పు!’ అన్నాడు. ‘గురువర్యా! నేను వెళ్తున్నప్పుడు ఒక చిన్న వాగును దాటుతున్నాను. వాగుమధ్యలో ఒక పెద్ద మట్టికుప్ప కొట్టుకుని పోతోంది. ఆ కుప్పలో చీమలపుట్ట ఉంది. కొద్ది నిమిషాల్లో మట్టి కరిగితే చీమలన్నీ చనిపోతాయని ఒక కొమ్మ సాయంతో వాటిని ఒడ్డుకు పాకించాను. తర్వాత ఊరికి వెళ్లిపోయాను’ అన్నాడు. గురువు గారికి విషయం బోధపడింది. ‘మంచిపనుల ఫలితం అలాంటిది. అది విధిరాతను సైతం మార్చేస్తుంది’ అనుకుని తల పంకించారు. 

- టి.చంద్రహాస్‌ చక్రవర్తి  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని