చేసేది జీవహింస.. చెప్పేది ధర్మసూక్ష్మం

వేదపండితుడైన బ్రాహ్మణుడికి క్షత్రియ మిత్రుడున్నాడు. ధనుర్విద్య నేర్చిన ఆ ఇద్దరూ ఒకసారి వేటకు వెళ్లారు.

Published : 22 Dec 2022 00:25 IST

వేదపండితుడైన బ్రాహ్మణుడికి క్షత్రియ మిత్రుడున్నాడు. ధనుర్విద్య నేర్చిన ఆ ఇద్దరూ ఒకసారి వేటకు వెళ్లారు. ఆ అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఎండిన ఆకులు, తీగలు, గడ్డి ఆయన్ను కప్పేశాయి. దురదృష్టవశాత్తు బ్రాహ్మణ యువకుడు వేసిన బాణం మునీశ్వరుడికి తగిలింది. ఆయన రోదిస్తూ నేలకొరిగాడు. అతడు పరుగెత్తుకు వెళ్లి కావాలని చేయలేదంటూ క్షమించమని ప్రార్థించాడు. మునికి కోపమొచ్చింది. ‘నాకు బాణం తగిలినందుకు కాదు. బ్రహ్మణుడివయ్యుండి క్షత్రియోచిత విలువిద్య నేర్వటం తప్పు. వేటాడటం మరీ తప్పు. అందుకుగాను జంతువులని హింసించి జీవించే బతుకుతెరువు గల వ్యాధుడిగా జన్మిస్తావు’ అంటూ శపించాడు. తన అజ్ఞానాన్ని మన్నించమని వేడుకున్నాడు. మునుల కోపం తాత్కాలికమే. కానీ ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోవటం కుదరదు. ‘నువ్వలా జన్మించక తప్పకున్నా ధర్మాధర్మ పరిజ్ఞానం కలిగుంటావు. తల్లిదండ్రులకు భక్తితో సేవచేసి, తరిస్తావు. పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది’ అంటూ వివరించాడు. అతడు ముని శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని తీసి ఆశ్రమానికి చేర్చాడు. ఆయన ప్రాణం పోలేదు. కనుక బ్రహ్మహత్యాపాతకం అంటలేదు. బాధ కలిగించినందున వ్యాధుడిగా అంటే మాంసం అమ్మి జీవించేవాడిగా పుట్టాడు. మిథిలానగరంలో పుట్టిన ఆ ధర్మవ్యాధుడి వద్దనే కౌశికుడనే కోపిష్టి బ్రహ్మచారి ధర్మం గురించి తెలుసుకున్నాడు. ఎవరికి తగిన చదువు వారు ఎంచుకోవాలే గానీ ఎదుటివారిని అనుసరించకూడదు. ధర్మవర్తనులు వయోవృద్ధులకు సైతం ఉపదేశించే స్థితికి వస్తారు- అనేది సారాంశం.    

డా.అనంతలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని