ముగ్గుతో దిగ్బంధనం

మన ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక లాభాలెన్నో ఉన్నాయి. నిత్యం ఇంటి ముందు, వెనుక, తులసి మొక్క వద్ద, దీపారాధన చేసేచోట ముగ్గులేయాలి.

Updated : 22 Dec 2022 06:53 IST

న ముగ్గుల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక లాభాలెన్నో ఉన్నాయి. నిత్యం ఇంటి ముందు, వెనుక, తులసి మొక్క వద్ద, దీపారాధన చేసేచోట ముగ్గులేయాలి. ముగ్గు ధనధాన్యాలను, దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. గడప ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా, ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ఏ పూజలోనైనా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసి, దానికి నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీస్తారు. దీన్ని అష్ట దిగ్బంధనం అంటారు.  

నక్షత్రాకారంలో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను దరిదాపులకు రానీయదు. పద్మాలు, చుక్కల ముగ్గుల్లోనూ అంతరార్థం ఉంది. అవి కేవలం గీతలు కాదు, బలమైన యంత్రాలు. అందుకే ముగ్గును తొక్కకూడదు అనే నియమం పెట్టారు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మంవేసి దీపారాధన చేస్తారు. యజ్ఞ యాగాల్లో, దైవ కార్యాల్లో నాలుగు గీతలతో కూడిన ముగ్గులేస్తారు. వధూ వరులు తొలిసారి భోజనం చేసేచోట లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులేయాలి. దేవతా రూపాలను, శ్రీ, ఓం, స్వస్తిక్‌ గుర్తులను ముగ్గులుగా వేయకూడదు. దేవాలయాల్లో ముగ్గులు వేస్తే రాబోయే జన్మల్లోనూ వైధవ్యం రాదని దేవిభాగవతం, బ్రహ్మాండపురాణాల కథనం.

ధనుర్మాస ఆరంభం నుంచి ఉత్తరాయణ ప్రవేశం వరకు మహిళలు వాకిట్లో రంగవల్లులు తీర్చిదిద్దుతారు. అలాగని, నడిచేందుకు చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు. ఎక్కువరోజులు ఉండాలని కృత్రిమ ముగ్గు పెట్టకూడదు. బియ్యప్పిండితోనే ముగ్గులేయాలి. దాన్ని చీమలు, పక్షులు తింటాయి కనుక భూతదయకు, పర్యావరణ పరిరక్షణకు చిహ్నం. ముగ్గు శుభాశుభాలకు సంకేతం. ఇంటి ముందు ముగ్గు లేదంటే అశుభం జరిగిందని గుర్తు. ఇల్లిల్లూ తిరిగి బిక్ష సేకరించే సాధుసన్యాసులు ముగ్గు లేని ఇంటికి వెళ్లేవారు కాదు. శ్రాద్ధకర్మల సమయంలో ముగ్గు వేయరు. పూర్తయ్యాక.. అది మధ్యాహ్నమైనా సరే వెంటనే ముగ్గు వేస్తారు. రోజూ మనం వేసే, చూసే సాధారణ ముగ్గుల్లో విజ్ఞానం, వినోదం కూడా ఉన్నాయి కదూ!

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని