సంతానం ఎందుకు?!

ఆదిశంకరుల వారి సన్నిధిలో సంతానం గురించి ప్రస్తావన రాగా.. ‘మందపాలుడు ముని అయినప్పటికీ పుణ్యగతులు పొంద లేదు.

Updated : 05 Jan 2023 03:47 IST

ఆదిశంకరుల వారి సన్నిధిలో సంతానం గురించి ప్రస్తావన రాగా.. ‘మందపాలుడు ముని అయినప్పటికీ పుణ్యగతులు పొంద లేదు. సంతానం లేకపోవడమే కారణమన్నారు దేవతలు. దాంతో ముని పక్షిరూపం ధరించి, ఆడ పక్షితో కూడి నలుగురు పిల్లల్ని కన్నాడు. ఖాండవ వన దహనానికి వెళ్తున్న అగ్నిదేవుణ్ణి చూసి తన భార్యాపిల్లలున్న చెట్టు వద్ద మాత్రం వ్యాపించవద్దంటూ ప్రార్థించాడు. సంతానవంతుడైన కారణంగా ఉత్తమ లోకాలకు వెళ్లిపోయాడు’ అంటూ భారత కథను గుర్తుచేశారు. ‘భార్యతో సుఖించి సంతానం పొందడం స్వార్థం అవుతుంది. అలాగే భార్యాబిడ్డల పోషణ బాధ్యతే తప్ప త్యాగం కిందికి రాదు కదా!’ అన్నాడో శిష్యుడు. ‘నిజమే. పురుషుడి అహానికి భిన్నంగా ఉంటారు భార్యాబిడ్డలు. అహంతో పెళ్లి చేసుకున్నా, బిడ్డలను కన్నా అది స్వార్థం. కానీ వారి పోషణకి పురుషుడు తన శ్రమను, తెలివిని త్యాగం చేస్తాడు. తాను లేకున్నా వారు సుఖంగా ఉండటానికి ఆస్తిపాస్తులు త్యాగరూపేణా ఇచ్చి వెళ్తున్నాడు. కనుక సంతానం కోసం చేసిన ఈ త్యాగం తండ్రికి పుణ్య హేతువు అవుతోంది. అందుకే పిల్లలు కలిగిన తర్వాత మందపాలుడికి పుణ్యలోకాలు సంప్రాప్తించాయి. మాతృత్వానికీ పితృత్వానికీ అంత ప్రాముఖ్యమిచ్చింది మన ధర్మం. తన సృష్టి సజావుగా సాగడానికే కాదు దానికి దోహదం చేసే ప్రతి జీవికీ పుణ్యగతులు కలగాలనే సదుద్దేశంతోనే బ్రహ్మదేవుడు సంతానం ఉండాలనే నియమం ఏర్పరిచాడు’ అంటూ వివరించారు.

 ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని