అభిజిత్‌ ముహూర్తమంటే...

ఉత్తరాషాఢ నక్షత్ర చివరిపాదం, శ్రవణం మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని కలిపి, ‘అభిజిత్‌’ నక్షత్రం అంటారు.

Published : 19 Jan 2023 00:14 IST

త్తరాషాఢ నక్షత్ర చివరిపాదం, శ్రవణం మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని కలిపి, ‘అభిజిత్‌’ నక్షత్రం అంటారు. ముహూర్తం అంటే సుమారు 48 నిమిషాలు. రోజుకు 30 ముహూర్తాలుంటాయి. సూర్యోదయం తర్వాత వచ్చే 8వ ముహూర్తం అభిజిత్‌ ముహూర్తం. మధ్యాహ్నం 12 కంటే 24 నిమిషాల ముందు ప్రారంభమై, 12 తర్వాత ఇంకో 24 నిమిషాలుంటుంది.

పురాణ కథను అనుసరించి దక్షప్రజాపతి తన కుమార్తెలైన 27 నక్షత్రాలకూ చంద్రుడితో పెళ్లి చేశాడు. రోహిణిని ఎక్కువ ప్రేమించిన చంద్రుడు ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణం ఊరుకోలేదు. తన ఛాయను తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి తండ్రి దగ్గరికెళ్లింది. అది వదిలిన ఛాయ అభిజిత్తు పేరుతో 28వ నక్షత్రంగా ఏర్పడింది. సర్వ దోషాలనూ పోగొట్టే శక్తిని పొందింది. ఈ ముహూర్తంలో సూర్యభగవానుడు దశమ స్థానంలో ఉంటాడని, ఇది అనేక దోషాలను పోగొడు తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మరో కథ ప్రకారం అయోధ్యలో రామాలయ నిర్మాణంలో భూమిపూజను అభిజిత్‌ లగ్నంలోనే చేశారు. ఈ విజయముహూర్తంలోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. దేవతలు సముద్ర మథనం ప్రారంభించారు. ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు. శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, భీష్మపితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన ముహూర్తం కూడా ఇదేనంటారు. ఇలా ఎన్నో దృష్టాంతాలున్నాయి. ఈ ముహూర్తంలో శుభకార్యాలు చేయకూడదనేది సరికాదు. ఈ లగ్నంలో వారం, వర్జ్యం, తిథి- ఏవీ అవసరం లేదు, సర్వత్రా విజయం సిద్ధిస్తుందని నమ్ముతారు. అభిజిత్‌ లగ్నం సర్వశ్రేయోదాయకమని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నప్పటికీ ఈ ముహూర్తంలో బుధవారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయకూడదు, ఈ లగ్నం ఉపనయనానికి పనికిరాదు- అని ‘నారదసంహిత’ పేర్కొంది.

డా.టేకుమళ్ల వెంకటప్పయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని