అవునా?!

హకుయిన్‌ జెన్‌ మాస్టర్‌గా స్వచ్ఛమైన జీవితం గడుపుతున్నా రంటూ చుట్టుపక్కల అందరూ పొగడ్తలతో ముంచెత్తేవారు.

Updated : 02 Mar 2023 03:10 IST

హకుయిన్‌ జెన్‌ మాస్టర్‌గా స్వచ్ఛమైన జీవితం గడుపుతున్నా రంటూ చుట్టుపక్కల అందరూ పొగడ్తలతో ముంచెత్తేవారు. ఆయన నివాసానికి దగ్గర్లో ఒక జపాన్‌ యువతి ఉండేది. చాలా అందమైంది. వాళ్ల కుటుంబానికి ఆహార పదార్థాలు అమ్మే అంగడి ఉంది. ఉన్నట్టుండి తమ కూతురు గర్భవతి అని తెలిసింది వాళ్లకి. దానికి ఎవరు కారణమని ఎంత అడిగినా ఆమె చెప్పలేదు. గట్టిగా నిలదీయడంతో హకుయిన్‌ పేరు చెప్పింది. వాళ్లు జెన్‌ గురువు దగ్గరికెళ్లి ‘అవునా?!’ అనడిగారు ఆశ్చర్యంగా. హకుయిన్‌ బదులివ్వకుండా మౌనంగా ఉండిపోయారు. కొన్నాళ్లకు యువతికి పాప పుట్టింది. ఆమెని హకుయిన్‌కి ఇచ్చారు. అప్పటికే పరువుప్రతిష్ఠలు పోయాయి. అయినా అతనేమీ చింతించలేదు. ఎప్పట్లాగే ఉదారంగా, గంభీరంగా కనిపించారు. పాపను మాత్రం కంటికి రెప్పలా పెంచసాగారు. యువతి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. తన గర్భానికి హకుయిన్‌ కారకుడు కాదు... అసలు వ్యక్తి చేపల మార్కెట్టులో పనిచేసే కుర్రాడంటూ నిజం చెప్పింది. ఆమె తల్లిదండ్రులు మరోసారి ఆయన వద్దకు వెళ్లి ‘మా అమ్మాయి భయపడి అబద్ధం చెప్పినందున ఇలా జరిగింది’ అంటూ క్షమించమన్నారు. ఆయన ప్రశాంత వదనంతో పాపను తిరిగిస్తూ ‘అవునా?!’ అన్నారు.
వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని