సందేహం.. సమాధానం

జెన్‌ మాస్టర్‌ నవ్వుతూ ‘చాలామంది గతంలో జరిగిన సంగతులనే నెమరేస్తుంటారు. లేదా ముందెప్పుడో జరగబోయే విషయాల గురించి ఆలోచిస్తారు.

Published : 09 Mar 2023 00:27 IST

గురువర్యా! ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి?’ అనడిగాడో శిష్యుడు.
‘ఆకలేస్తే తిను, అలసిపోతే నిద్రపో’ అంటూ జవాబిచ్చారు జెన్‌ మాస్టర్‌.
శిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు.

జెన్‌ మాస్టర్‌ నవ్వుతూ ‘చాలామంది గతంలో జరిగిన సంగతులనే నెమరేస్తుంటారు. లేదా ముందెప్పుడో జరగబోయే విషయాల గురించి ఆలోచిస్తారు. ఆనందం ఎక్కడో దొరుకుతుందని అన్వేషిస్తారు. నిజానికది జటిలమైందో, దక్కించుకోలేనంత కష్టమైందో కాదు. ఆనందం అనేది మనలోనే ఉంటుంది. దాన్ని ఎంతో తేలిగ్గా కనిపెట్టి అనుభూతి చెందొచ్చు. కానీ ఆ సంగతి తెలుసుకోలేక తపించిపోతుంటారు. ఎలాంటి స్థితినైనా స్వీకరించడం అనే చిన్న పని చేయ గలిగితే చాలు.. బాధ, దుఃఖం కలగవు. ఎవరి మీదా కోపం, ఆవేశం రావు. ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక్క మాట చెబుతా, గుర్తుంచుకో! నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి. ఇలాగే ఉండు, ఈ పనే చెయ్యి అంటూ వేరెవరో నీకు ఆదేశాలు జారీ చేయనవసరం లేదు. నీకు నువ్వే కర్తవి, కర్మవి. అయిష్టత, అసహనాలు వద్దు. అవి ఆందోళన కలిగిస్తాయి. ఉన్నదాన్ని గుర్తించడం, దాన్ని ఒప్పుకుని ముందుకు సాగడమే జ్ఞానం.. అదే ఆనందం’ అంటూ వివరించారు జెన్‌ మాస్టర్‌. ఇక శిష్యుడి సందేహాలన్నీ తీరిపోయాయి.

వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని