అసలైన ఆరాధకులు

ఒకసారి కవీంద్రుడు రవీంద్రుడు బుద్ధగయను సందర్శించారు. తథా గతుణ్ణి తలచుకుంటూ అక్కడ నిర్మితమయిన సుందర మందిరం లో అడుగుపెట్టారు.

Published : 13 Apr 2023 00:23 IST

ఒకసారి కవీంద్రుడు రవీంద్రుడు బుద్ధగయను సందర్శించారు. తథా గతుణ్ణి తలచుకుంటూ అక్కడ నిర్మితమయిన సుందర మందిరం లో అడుగుపెట్టారు. ధ్యానముద్రలో ఉన్న బుద్ధ ప్రతిమను ఆరాధనగా చూస్తూ నివాళులర్పిస్తున్నారు. ఇంతలో జపాన్‌ నుంచి వచ్చిన యువకుడు మౌనంగా లోనికి వచ్చాడు. విగ్రహం ముందు మోకరిల్లి చేతులు జోడించి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. పదే పదే తనలో తాను ‘నేను బుద్ధుణ్ణి శరణుజొచ్చాను, నేను బుద్ధుణ్ణి శరణుజొచ్చాను’ అంటున్నాడు. రవీంద్రుడు ఆశ్చర్యంగా చూస్తుండి పోయారు. సాయంత్రం గడిచి, అర్ధరాత్రి అయ్యే దాకా యువకుడు అక్కడే ఏకాగ్రచిత్తుడై ప్రార్థిస్తూనే ఉన్నాడు. తర్వాత అతడు మందిరం నుంచి బయటకు రాగా, రవీంద్రుడు ఆసక్తిగా పలకరించారు. ఆ యువకుడు ఉద్వేగానికి లోనయ్యాడు. ‘నేనెన్నో అపరాధాలు చేశాను. కానీ ఈ మహానుభావుడి గురించి తెలుసుకున్నాక, ఆయన ప్రబోధాలను చదివాక, నేనెంతో మారిపోయాను. ఇంకెన్నడూ పాపపు పనులు చేయను. నా పశ్చాత్తాపాన్ని ఆ మూర్తి ముందు ప్రకటించడానికే ఇక్కడికి వచ్చాను’ అంటూ తన మనోభావాలు పంచుకున్నాడు. రవీంద్రుడు ప్రశాంతంగా చూస్తూ ‘నిజమైన అభిమాను లు, ఆరాధకులు అంటే ఇలా ఉండాలి. బుద్ధుడి అడుగుజాడల్లో నడుస్తున్న అసలైన అనుయాయులు వీళ్లే కదా! ఆ చరితార్థుడి బోధనల్ని మనలో ఎంతమందిమి, ఎంత వరకూ ఆచరిస్తున్నాం?’ అనుకుని మథనపడ్డారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని