ప్రార్థన ఎందుకు?

ప్రార్థన ఎందుకు చేయాలని చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామిని అడిగాడో భక్తుడు. దానికి స్వామి ‘ఆరోగ్యం కోసం వైద్యుని వద్దకు, బతుకుతెరువు కోసం వ్యాపారుల వద్దకు, తగాదాలు తీర్చేందుకు పెద్దల వద్దకు వెళ్లినట్లే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జించేందుకు గురువును ఆశ్రయించాలి.

Published : 20 Apr 2023 00:42 IST

ప్రార్థన ఎందుకు చేయాలని చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామిని అడిగాడో భక్తుడు. దానికి స్వామి ‘ఆరోగ్యం కోసం వైద్యుని వద్దకు, బతుకుతెరువు కోసం వ్యాపారుల వద్దకు, తగాదాలు తీర్చేందుకు పెద్దల వద్దకు వెళ్లినట్లే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జించేందుకు గురువును ఆశ్రయించాలి. అతడు కనిపించే దేవుడు. చుట్టూ ఎందరున్నా పూర్తి సాయం దొరకడంలేదు. అందు వల్ల మొట్టమొదట మన సమస్యలను భగవంతుడి ముందుంచి అటుపై మనుషుల సాయం కోరాలి. మన వాళ్లని నిరాశ్రయుల్ని చేసి మోక్ష గాములం కాలేం కదా! ముందు వారి అవసరాలు తీర్చాలి. మన కర్మలు ఫలించాలంటే ముందు ప్రయత్నించాలి, ఆనక ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈ రెంటిలో ఏది లేకున్నా అనుకున్నది సిద్ధించదు. అదలా ఉంచితే ప్రార్థన వల్ల అసలైన ప్రయోజనం మనశ్శాంతి. ఎన్ని సంపదలున్నా ప్రశాంతత లేకుంటే తృప్తి ఉండదు. అందుకే బాహ్య విషయాల నుంచి కలిగే దుఃఖ విమోచన కోసం ప్రార్థించాలి. దేవుడు సముద్రం అయితే అందులో వచ్చిపోయే తరంగాలే మనం- అనుకుంటే కనుక దేవుడు, మనం ఒకరమే అనే భావన కలుగుతుంది. అంతా ఒకటేనన్న సమభావనా కలుగుతుంది. అప్పుడు కష్టాలు కర్పూరంలా కరిగిపోతాయి. ఇహలోకంలో ఎదురయ్యే కష్టసుఖాలను అనుభవిస్తూ మోక్ష సాధన చేయాలి. అది ప్రార్థనతోనే సాధ్యం’ అంటూ వివరించారు.

డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని