నీళ్లు లేవు.. చంద్రుడు లేడు..

జపాన్‌ ఎంగకుజిలో జెన్‌ మాస్టర్‌ బుక్కో ఉండేవారు. ఆయన వద్ద చియోనో అనే యువతి శిష్యురాలిగా చేరింది. నిత్యం ఆయన చెప్పే పాఠాలు అందరితో పాటు వినేది.

Published : 04 May 2023 00:12 IST

పాన్‌ ఎంగకుజిలో జెన్‌ మాస్టర్‌ బుక్కో ఉండేవారు. ఆయన వద్ద చియోనో అనే యువతి శిష్యురాలిగా చేరింది. నిత్యం ఆయన చెప్పే పాఠాలు అందరితో పాటు వినేది. క్రమం తప్పకుండా మెడిటేషన్‌ చేసేది. కానీ ఎన్నాళ్లు గడిచినా ఆమెకి ఒనగూరిందేమీ లేదు. బహుశా ధ్యానంలో ఆమె మనసు పూర్తిగా నిమగ్నం కాలేదేమో. అయితే ఆమెకొక అలవాటుంది. ప్రతి రోజూ ఒక పురాతన మట్టికుండలో నీళ్లు తీసుకొచ్చి మొక్కల దగ్గర పెడుతుంది. ఆకాశంలో చంద్రుడు ఆ నీళ్లలో తేలియాడు తుంటే దాన్నలా చూస్తుంది. కుండను విడిగా పట్టుకోవడం కొంచెం కష్టం కనుక వెదురు కర్రను దానికి తాడుతో బిగించి పట్టుకోవడానికి అనుకూలంగా తయారుచేసుకుంది. ఎప్పటిలాగే ఆరోజు నీళ్లు తెస్తుంటే వెదురు కర్ర కాస్తా విరిగిపోయింది. పాత కుండ పగిలిపోయి, నీళ్లన్నీ ఒలికిపోయాయి. అప్పుడు చియోనోకి బాధ కలగడానికి బదులు ఏదో విముక్తి లభించినట్టుగా, ఎంతో హాయిగా అనిపించింది. ఆ క్షణం తన మనసు స్థితికి అక్షర రూపం ఇవ్వాలనుకుంది.

దీపం ముందు కూర్చుని కాగితం, కలం అందుకుంది...
ఇన్నాళ్లూ పాతకుండని కాపాడుతూ వచ్చా
వెదురుబద్ద బలహీనమౌతుంటే
అదెప్పుడు విరిగిపోతుందో
కుండ పగులుతుందోనని భయంతో గడిపా
ఈరోజు అదే జరిగింది
కుండ కాస్తా బద్దలయ్యింది
ఇప్పుడిక అందాల కుండలో నీళ్లూ లేవు
ఆ నీటిలో చందమామా లేదు

అంటూ రాసింది.

 వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని