భారతం పంచమవేదం ఎందుకయ్యింది?

మహాభారతం మనకెన్ని పాఠాలు నేర్పుతుందో! ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదన్నారు. ఎంత గుణవంతుడైనా వ్యసనాలకు లోనైతే ధర్మరాజులా జూదరిగా మారి సర్వస్వాన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది.

Published : 11 May 2023 00:37 IST

మహాభారతం మనకెన్ని పాఠాలు నేర్పుతుందో! ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదన్నారు. ఎంత గుణవంతుడైనా వ్యసనాలకు లోనైతే ధర్మరాజులా జూదరిగా మారి సర్వస్వాన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. కనుక అలా కావద్దని సూచిస్తుంది. దాయాదులు స్నేహంగా ఉండాలే గానీ ప్రతీకారాలకు పోతే దుర్యోధనుడిలా నాశనమైపోతారన్న నీతి బోధపడుతుంది. ధృతరాష్ట్రుడిలా మితిమీరిన పుత్రప్రేమ చూపితే అనాథల్లా మిగులుతారని పాఠం చెబుతుంది. భీష్ముడంతటి వీరుడైనా, విద్యావంతుడైనా చెడుపక్షాన నిలబడితే శిఖండి వంటి అల్పుడు కూడా హతమార్చ గలడని బోధిస్తుంది. మహావీరుడైన కర్ణుడు చెడు స్నేహం వల్ల మరణం పాలైన నీతిని ఉద్బోధిస్తుంది. తనకు తెలిసిన సగం విద్యతో పద్మవ్యూహంలోకి పరుగులు తీసిన అభిమన్యుడి మరణం- తొందరపాటు ఎన్నటికీ హితం కాదన్న నీతిని ఉపదేశిస్తుంది. పరిచారికా వృత్తిలో ఉన్న ద్రౌపది వివాహిత అని తెలిసి కూడా రాజ్యాధికార గర్వంతో ఆమెని అనుభవించాలని ప్రయత్నించి చనిపోయాడు కీచకుడు. రక్షించాల్సిన యజమాని భక్షించాలని చూస్తే నీచ మరణం తప్పదనే హెచ్చరిక అది. ఇలా ఎన్ని ఉద్బోధలో, ఎన్నెన్ని పాఠాలో! అలాగే విదుర నీతి, సంజయరాయబారం, భీష్మహితం, భగవద్గీత.. ఇలా ధర్మోపదేశాలూ, సత్యావిష్కరణ లతో మహాభారతం పంచమవేదమయ్యింది. కనుకనే చదివితే భారతమే చదవా లన్న నానుడి పుట్టింది.

గోవిందం ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని