గుడిలో ఘంటానాదం ఎందుకు?

ఘంటానాదంతో దేవతలు మేల్కొంటారని ధర్మగ్రంథాలు స్పష్టం చేశాయి. ఆలయంలో గంట మోగించినప్పుడు ఏర్పడే శబ్దం పరమాత్ముడి ప్రతిరూపమైన ఓంకారం.

Published : 04 Jul 2024 00:11 IST

ఘంటానాదంతో దేవతలు మేల్కొంటారని ధర్మగ్రంథాలు స్పష్టం చేశాయి. ఆలయంలో గంట మోగించినప్పుడు ఏర్పడే శబ్దం పరమాత్ముడి ప్రతిరూపమైన ఓంకారం. ఆ పవిత్రనాదం అక్కడి వ్యక్తులను, చుట్టూ ఉన్న పరిసరాలను పవిత్రం చేస్తుంది. భగవంతుణ్ణి దర్శించేందుకు వచ్చిన భక్తుల బాహ్య, అంతరంగాలు రెండూ పరిశుద్ధమై ఉండాలి.  ఘంటానాదం మానసిక అలజడులను తొలగిస్తుంది. గంటతో పాటు శంఖాన్ని, సంగీత వాద్యాలను కూడా ఉపయోగించటం సంప్రదాయం. ఘంటానాదంతో కూడిన ఈ వాద్య ఘోష అశుభాలనూ, రణగొణ ధ్వనులనూ, అవమానించడం, దూషించడం వంటి మాటలను మన చెవులకు చేరకుండా చేసి, ఏకాగ్రత నిలిచేలా చేస్తుంది. శబ్దం అవిచ్ఛినంగా సాగడాన్ని ‘నాదం’ అంటారు. ‘న’ అంటే ప్రాణం; ‘ద’ అంటే అగ్ని; ఆ ప్రాణాగ్నుల కలయికే నాదం- అని వివరించారు మన మహర్షులు. నాదం రెండు రకాలు. మొదటిది ఆహత నాదం. ఇది చెవులకు హాయిగా వినిపిస్తూ, రసానుభూతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. రెండోది అనాహత నాదం. ఇది వినిపించకుండా మానసిక అనుభూతిని కలిగిస్తుంది. నిశ్చల మనస్కులై, యోగదృష్టి కల వారికే ఈ నాదం అనుభూతిలోకి వస్తుందని ఆధ్యాత్మిక సాధకులు చెబుతారు. ఆలయంలో ఘంటానాదం వల్ల పుట్టే శబ్ద తరంగాలకు ఎంతో ప్రభావం ఉంటుంది. చంచలమైన మనసును భగవంతుడి మీద లగ్నం చేయటానికి తోడ్పడుతుంది. దేవతా విగ్రహాల్లో ఈ ఘంటానాదం వల్ల దైవత్వం ప్రేరేపితమవుతుందన్నది పురాణ వచనం.

బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని