ఆషాఢం ఎందుకు విశిష్టం?!

పూరి జగన్నాథ స్వామి రథయాత్ర, శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతం, వాసుదేవ ద్వాదశి, వ్యాసపౌర్ణమి.. ఇలా అనేక పర్వదినాలతో ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతుంది ఆషాఢమాసం.

Published : 04 Jul 2024 00:12 IST

(జులై 6 ఆషాఢ మాసం ఆరంభం)

పూరి జగన్నాథ స్వామి రథయాత్ర, శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతం, వాసుదేవ ద్వాదశి, వ్యాసపౌర్ణమి.. ఇలా అనేక పర్వదినాలతో ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతుంది ఆషాఢమాసం. పూరీ పుణ్యక్షేత్రంలో భక్తజన బాంధవుడైన శ్రీజగన్నాథుని రథయాత్ర ఈ మాసంలో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం పంచుతుంది. ఆలయంలోని మూలవిరాట్టునే ఊరేగించడం ఇక్కడి విశిష్టత. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చి జగన్నాథుని దర్శించుకుని పునీతులవుతారు. ఆషాఢ శుద్ధ ఏకాదశే తొలి ఏకాదశి. ఈ పుణ్య దినాన ఉపవాసం ఉండి చాతుర్మాస్య వ్రతం ప్రారంభించాలని ధర్మరాజుకు శ్రీకృష్ణపరమాత్ముడు ఉపదేశించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మన పర్వదినాల్లో పాటించే నియమాలు, ఆరగించే ప్రసాదాలు ఆయా కాలాల్లో వచ్చే అనారోగ్యాలను నివారించే విధంగా రూపొందాయి. చాతుర్మాస్య వ్రతం చేసేవారు శ్రావణ మాసంలో శాకం, భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వయుజ మాసంలో పాలు, కార్తిక మాసంలో పెసలు మొదలైనవాటిని విడిచిపెట్టాలన్నది శాస్త్ర వచనం. లోకోపకారం కోసం వ్యాసుడు అవతరించింది కూడా ఈ మాసంలోనే. ఆషాఢ శుద్ధ పూర్ణిమే వ్యాసపూర్ణిమ లేదా గురుపౌర్ణమి. అంటే గురుపూజ మహోత్సవం నిర్వహిస్తారు. శిష్యులు ఈ రోజున తమ గురువును ఆరాధించి, సకల శుభాలూ పొందుతారు. ఇలాంటి ఎన్నో విశిష్టతలు ఉన్నందున ఆషాఢమాసాన్ని ఆధ్యాత్మిక మాసం అంటారు.

శివశ్రీ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని