దార... జాయ... పత్ని... వీరెవరు?

స్త్రీకి మన భాషలో పదుల సంఖ్యలో పర్యాయపదాలు.. అవి ఆమె నిర్వహించే విభిన్న పాత్రలకు ప్రతిరూపాలు! ఇల్లాలికి ఇంగ్లిష్‌లో ఉన్నదొకటే మాట.. వైఫ్‌! మరి మనకో?

Published : 08 Mar 2018 01:54 IST

దార... జాయ... పత్ని... వీరెవరు?

స్త్రీకి మన భాషలో పదుల సంఖ్యలో పర్యాయపదాలు.. అవి ఆమె నిర్వహించే విభిన్న పాత్రలకు ప్రతిరూపాలు! ఇల్లాలికి ఇంగ్లిష్‌లో ఉన్నదొకటే మాట.. వైఫ్‌! మరి మనకో?.. జాయ, పత్ని, భార్య, దార, సతి.. ఎన్నో! వీటిలో ఒక్కోమాటను ఒక్కో ప్రత్యేక సందర్భంలో ప్రస్తావిస్తుంటారు.
* అగ్నిసాక్షిగా వివాహం జరిగి, యజ్ఞయాగాదులతో సహధర్మచారిణిగా వ్యవహరించే స్త్రీ.. పత్ని. ఆవిడే ధర్మపత్ని.
* ఆలు అంటే.. ఇంటి ఆలు. ఇంటికి యజమానురాలు అని. ఆమె ఇల్లాలు.
* బిడ్డలకు జన్మనిచ్చిన ఇల్లాలికి జాయ అని పేరు.
* భార్య అంటే అర్థం.. భర్త దేశాంతరం వెళ్లినప్పుడు అతడి స్థానంలో కుటుంబ భారం వహించేది అని....
* సత్వగుణంతో శోభించేది సతి. అన్నివేళలో భర్తతో కలిసిమెలసి అన్యోన్యంగా జీవించేది.. దార!
ఏ పాత్రకు అదే ప్రత్యేకం! ఒక్కో పాత్రకు ఒక్కో సంబోధన. పురుషుడి జీవితంలో తాళికట్టిన భార్య ఇన్ని పాత్రలు పోషిస్తుంటే.. స్త్రీగా, గృహిణిగా, తల్లిగా, ప్రియురాలిగా, నాయికగా.. ఆకాశంలో సగమై, శివుడి శరీరంలో భాగమై, ఇంటికి దీపమై, కంటికి వెలుగై.. ఈ సృష్టికే శోభను చేకూరుస్తోంది. మహిళ లేకుంటే సృష్టేలేదు. అందం, ఆకర్షణ, సమర్థత, దక్షత, తెలివితేటలు, ఓర్పు.. స్త్రీ సహజ లక్షణాలు. కనుకనే ఆమె రూపం అపురూపం. లావణ్యానికి ప్రతిరూపం. అందానికున్న పర్యాయపదాలన్నీ ఆమెకే సొంతం. సరిగ్గా అర్థం చేసుకుంటే ఆమె స్వరూపం.. విశ్వరూపం.

-కప్పగంతు రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని