సిందూరంతో ప్రసన్నత

ఆంజనేయుడికి చేసే అర్చనలో భాగంగా స్వామి విగ్రహ దేహానికి సిందూరం పూసే ఆచారం బాగా ప్రచారంలో ఉంది. సిందూరం ఆంజనేయుడికి ఎందుకు ప్రీతిపాత్రమనే విషయాన్ని రామాయణగాథ మనకు తెలియజేస్తుంది....

Published : 10 May 2018 01:40 IST

ధర్మ సందేహం
సిందూరంతో ప్రసన్నత

ఆంజనేయుడికి సిందూరం ఎందుకు పూస్తారు?
ఆంజనేయుడికి చేసే అర్చనలో భాగంగా స్వామి విగ్రహ దేహానికి సిందూరం పూసే ఆచారం బాగా ప్రచారంలో ఉంది. సిందూరం ఆంజనేయుడికి ఎందుకు ప్రీతిపాత్రమనే విషయాన్ని రామాయణగాథ మనకు తెలియజేస్తుంది. రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు ఓ సందర్భంలో.. శ్రీరాముడు ఆంజనేయుడి భుజాలపై ఎక్కి యుద్ధం చేశాడు. ఆనాటి యుద్ధంలో రావణుడు సంధించిన బాణాలు ఆంజనేయుడికీ తగిలాయి. హనుమ ఒళ్లంతా రక్తసిక్తమైంది. అయినా ఏమాత్రం చలించకుండా దృఢదీక్షతో నిలబడ్డాడు హనుమ. ఆ సమయంలో ఆంజనేయుడి దేహం ‘పూచిన మోదుగచెట్టు వలె ఉంద’ని వాల్మీకి మహర్షి వర్ణించారు. తన స్వామికోసం రక్తమోడటం హనుమకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తినీ కలిగించింది. అర్చనలో భాగంగా భక్తులు తనకు సిందూరం పూస్తే ఆనాటి సంఘటన తలపులోకి వచ్చి పవనసుతుడు ఎంతగానో ప్రసన్నడు అవుతాడట. అందుకే ఆంజనేయునికి ‘సిందూరం’ పూసే ‘ఆచారం’ లోకంలో ప్రచారమైంది. అంతేకాదు, ఎర్రని రంగు పరాక్రమానికీ, పవిత్రతకూ, త్యాగానికీ సంకేతం. ఈ గుణాల సమ్మేళనమే హనుమంతుడు. కనుక అర్చన చేసే సమయంలో సిందూరం పూసే విధానం వాడుకలోకి వచ్చింది.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని