ఆకులు, వక్కలు... ఆనవాయితీలు

తాంబూల సమర్పణం, సేవనం అనేది ప్రాచీన కాలం నుంచీ భారతీయుల....

Published : 09 Aug 2018 01:44 IST

మీ కోసం
ఆకులు, వక్కలు... ఆనవాయితీలు

తాంబూల సమర్పణం, సేవనం అనేది ప్రాచీన కాలం నుంచీ భారతీయుల జీవన విధానంలో భాగమైన సంప్రదాయం. పురాణాలు, రామాయణ, భారతాలతో పాటు ‘చరక సంహిత’, శ్రీనాథ మహాకవి రచనల్లోనూ తాంబూల ప్రస్తావన ఉంది. అసలు తాంబూలం ఎందుకివ్వాలి? ఎవరికివ్వాలి? ఎలా ఇవ్వాలి?

* తాంబూలంలో ప్రధానమైనది ‘తమలపాకు’. దీనికి సంస్కృతంలో ‘నాగవల్లి’ అని పేరు. క్షీరసాగర సమయంలో జనించి, స్వర్గానికి చేరి అక్కడి నుంచి భూమిపైకి వచ్చినట్లుగా కథనం. స్వర్గానికి ‘నాకం’ అని పేరు. నాకం నుంచి పుట్టింది కనుక ‘నాకవల్లీ’ అయి తర్వాత ‘నాగవల్లీ’గా మార్పు చెందింది అంటారు.
దేవుడికి చేసే షోడశోపచార పూజల్లో తాంబూల సమర్పణ ఒకటి.

* ‘‘ఫూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతామ్‌’’ అని భగవంతుడికి తాంబూలం సమర్పించాలి. భగవంతుడికి  నివేదన తర్వాత తాంబూలం సమర్పించాలి.

* భగవంతుడికి తాంబూలంలో కనీసం మూడు ఆకులు, రెండు వక్కలు, పచ్చ కర్పూరం, ముత్యపుపొడి లేదా సున్నం ఉంచి సమర్పించాలి. తమలపాకులు, వక్కలు, సున్నంతో పాటు యాలకులు, జాజికాయ, జాపత్రి, కస్తూరి, కుంకుమపువ్వు, పుదీనా, కొబ్బరి తురుము కూడా కలుపుతున్నారు. ఇవన్నీ తర్వాత్తర్వాత వచ్చిన సంప్రదాయాలు. అతిథులను దైవస్వరూపులుగా చూసే సంప్రదాయం మనది కాబట్టి వారికి కూడా ఇదే విధంగా తాంబూలం ఇవ్వాలి.

* పూర్వం ఒప్పందాలు కుదిరిన సమయంలో ఇరుపక్షాలు తాంబూలాలు మార్చుకునేవారు. యుద్ధానికి వెళ్లే ముందు సైనికాధికారులకు తాంబూలం ఇచ్చి పంపేవారు. ఇప్పటికీ వివాహాలు కుదిరిన సమయంలో నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడం చూస్తుంటాం.

* వస్త్రాలు ఎవరికైనా పెట్టే సమయంలో తప్పనిసరిగా తాంబూలం ఉంచాలి.
* తాంబూలం వేసుకున్న సమయంలో మొదటగా వచ్చే రసం విషతుల్యం అనీ, రెండోది విరేచనకారి అనీ, మూడోది అమృత తుల్యమని ఆయుర్వేదం వెల్లడిస్తోంది. కనుక మొదటి రెండు మింగరాదు. మూడోది మింగాలంటారు.
* తాంబూల సేవనం జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు నోరు, దంతాలు, నాసిక, కంఠం, నేత్ర సంబంధ వ్యాధులు రాకుండా చూడడంతో పాటు ఎముకలు, గట్టిపడేందుకు దోహదం చేస్తుంది.
* వివిధ దేవుళ్లకు ఆకులతో పూజలు చేసినా.. శ్రీఆంజనేయుడికి తమలపాకులతో పూజ అత్యంత ప్రీతికరమైనది.

- ఐఎల్‌ఎన్‌ చంద్రశేఖరరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు