...అలా లేనప్పుడు సిగ్గు పడండి!

సిగ్గు, బిడియం... ఇంచుమించూ ఒకటే అర్థాన్నిచ్చే జంట పదాలివి. అయితే చాలామంది సిగ్గూబిడియాలను చిన్న విషయాల్లానే చూస్తారు.

Published : 06 Sep 2018 01:29 IST

ఇస్లాం సందేశం
...అలా లేనప్పుడు సిగ్గు పడండి!

సిగ్గు, బిడియం... ఇంచుమించూ ఒకటే అర్థాన్నిచ్చే జంట పదాలివి. అయితే చాలామంది సిగ్గూబిడియాలను చిన్న విషయాల్లానే చూస్తారు. వాటిని ఎదుగుదలకు ఆటంకంగా భావించేవారూ లేకపోలేదు. కానీ వీటి వల్లనే మనిషిలో ఎన్నో నైతికగుణాలు అలవడతాయని... కాబట్టి వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని దివ్య ఖుర్‌ఆన్‌ ఆదేశిస్తుంది. కళ్లల్లో సిగ్గూ బిడియాలనే కాటుక రాసుకున్న వారు అనైతికమైన పనులు చేయడానికైనా, చూడటానికైనా, మాట్లాడటానికైనా సాహసించరు. ఎవరిలోనైతే అవి క్షీణిస్తాయో వారు నీతిబాహ్యమైన పనులకు పాల్పడతారు. అందుకే ఎవరైనా దిగజారి ప్రవర్తించినా, అవినీతికి పాల్పడినా ‘నీకు సిగ్గులేదూ’ అని మందలిస్తారు. . మహాప్రవక్త కాలంలో ఒక వ్యక్తి ఎంతో బిడియస్తుడిగా ఉండేవాడు. దానికి అతని సోదరుడు అతనిపై మండిపడేవాడు. ఇది గమనించిన ప్రవక్త ‘‘అతన్ని కోపగించుకోకు. ఎందుకంటే సిగ్గుపడడం విశ్వాసంలో అంతర్భాగం’’ అని ప్రబోధించారు. స్వతఃసిద్ధమైన ఈ గుణం ప్రశంసనీయమైనదని ప్రవక్త బోధనల సారాంశం. ఇస్లాం ధర్మం అన్ని రకాల నీతి బాహ్యమైన పనుల నుంచి, దుర్గుణాల నుంచి దూరంగా ఉండమని చెబుతుంది. మనిషిలో సహజంగా ఉండే ఈ బిడియం మనిషిని అన్ని రకాల చెడులకు దూరంగా ఉంచుతుంది. లజ్జా గుణం వల్ల మనిషికి మేలు మాత్రమే కలుగుతుందని ప్రవక్త హితవు పలికారు.

ఒక మనిషి ఎలాంటి జంకూగొంకూ లేకుండా చెడు కార్యాలకు పాల్పడుతున్నాడంటే అది అతని లజ్జావిహీనతకు నిదర్శనం. ‘అతనిలో (ఈమాన్‌) విశ్వాసమనేది కించిత్తు కూడా ఉండదు. సైతాన్‌ పట్టిన ఉన్మాదిలా మారిపోతాడు.‘‘ అని ప్రవక్త ముహమ్మద్‌ తెలియజేశారు. ఇస్లాం ధర్మహేయమైన పనులను, నిస్సిగ్గును అస్సలు సహించదు. వీటిని మొగ్గలోనే తుంచి వేస్తుంది.‘‘పరస్త్రీపై కన్ను పడగానే దృష్టి మరల్చుకో. మొదటి చూపు నీదేకాని రెండో చూపు సైతాన్‌ది’ అని ప్రవక్త హెచ్చరించారు. సిగ్గూ బిడియాలను వివరించేందుకు ఖుర్‌ఆన్‌లో అన్‌ నూర్‌ అనే అధ్యాయమే పొందు పర్చబడిందంటే వాటికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

-ఖైరున్నీసా బేగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు